Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రమ్ హోమ్ పై 'ఈ టైమ్స్ సర్వే ' ఏం తెలిసిందంటే ?

By:  Tupaki Desk   |   4 April 2021 1:30 AM GMT
వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఈ టైమ్స్ సర్వే  ఏం తెలిసిందంటే ?
X
కరోనా వైరస్ కారణంగా ఉద్యోగుల పని విధానంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది మార్చి నుంచి మన దేశంలో కరోనా విజృంభణ కారణంగా లాక్ డౌన్ ప్రారంభమైంది. దీనితో అన్ని ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు లాక్ డౌన్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం, దేశంలో కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కావడంతో ఆఫీసులు మళ్లీ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటాయని అనుకున్నారు. కానీ, దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్నే కంటిన్యూ చేస్తున్నాయి. దీనితో అసలు ఉద్యోగులు ఈ విధానాన్ని ఆహ్వానిస్తున్నారా, లేదా అయిష్టంగానే కొనసాగిస్తున్నారా , ఆఫీసులకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా, అనే విషయంపై ఎంటర్ టైన్ మెంట్ టైమ్స్ అనే సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది. అయితే , ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడైయ్యాయి.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 53.4% మంది వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం తమకు సౌకర్యవంతంగానే ఉందని, దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరారు. ఇక, 46.6% మంది మాత్రం ఇంట్లో పనిచేయడం కంటే ఆఫీసుల్లో పని వాతావరణమే బాగుండేదని, అక్కడైతే తమ సందేహాలను సహాద్యోగులతో పంచుకునే వాళ్లమని చెబుతున్నారు. ఆఫీసులు తెరిస్తే వెంటనే వెళ్లి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, ఎక్కువ మంది మహిళలు వర్క్ ఫ్రం హోంకు మొగ్గుచూపగా పురుషులు మాత్రం ఆఫీసులో పనిచేయడమే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ప్రారంభంలో ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హొమ్ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంటి నుంచి పని చేసుకుంటే డబ్బు మిగులుతుంది, ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదని భావించారు. కానీ, అదే పనిగా ఒకే దగ్గర కూర్చొని పనిచేయడంతో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని చాలా మంది చెప్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్లో ప్రశాంతమైన పని వాతావరణం లేకపోవడం కారణంగా పని ఉత్పాదకత చాలా వరకు దెబ్బతింటుందని అంటున్నారు. అయితే, సర్వేలో పాల్గొన్న వారిలో 71.3% మంది ఉద్యోగులు తమ ఉత్పాదకతలో ఎటువంటి తేడా లేదని, ఆఫీసులో ఉన్న విధంగానే అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నామని, ఏవైనా సందేహాలుంటే, జూమ్, స్కైప్ వంటి వీడియో కాన్ఫరెన్స్ యాప్ల ద్వారా నివృత్తి చేసుకుంటున్నామని చెబుతున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్సియ ప్రారంభం కావడంతో.. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ పనివిధానం వైపు మొగ్గు చూపుతున్నాయి. అటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం. ఇటు ఆఫీసులకు రాదల్చుకున్న వారు కార్యాలయాలకు వచ్చి ఉద్యోగ విధులను నిర్వర్తించే విధానంపై కసరత్తు చేస్తున్నాయి.