Begin typing your search above and press return to search.

సుబ్బ‌రామిరెడ్డి పొలిటిక‌ల్ రిటైర్మెంటా? ఏం చేస్తారిక‌!

By:  Tupaki Desk   |   26 Feb 2020 2:30 PM GMT
సుబ్బ‌రామిరెడ్డి పొలిటిక‌ల్ రిటైర్మెంటా? ఏం చేస్తారిక‌!
X
రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలాన్ని ముగించుకోబోతున్న నేత‌ల్లో ఒక‌రుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత తిక్క‌వ‌ర‌పు సుబ్బ‌రామిరెడ్డి. ఇప్ప‌టికే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయ్యింది. త్వ‌ర‌లోనే కొత్త స‌భ్యుల ఎన్నిక జ‌ర‌గ‌బోతూ ఉంది. ఆరేళ్ల ప‌ద‌వీ కాలాన్ని ముగించుకోబోతున్న నేత‌ల్లో సుబ్బ‌రామిరెడ్డి కూడా ఒక‌రిగా ఉన్నారు. కాంగ్రెస్ రాజ‌కీయాల్లో బాగా ప్రాధాన్య‌త పొందిన వారిలో సుబ్బ‌రామిరెడ్డి కూడా ఒక‌ర‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌జ‌ల నుంచి ఈయ‌న ఎన్నిక జ‌రిగి చాలా కాలం అయ్యింది. కొన్నేళ్లుగా రాజ్య‌స‌భ‌కు నామినేట్ అవుతూ ఉన్నారు. అదే హోదాలో మ‌న్మోహ‌న్ సింగ్ మంత్రి వ‌ర్గంలో కూడా ప‌ని చేశారు కొంత కాలం పాటు. ఇలాంటి నేప‌థ్యంలో ఇప్పుడు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వ కాలం కూడా ముగుస్తూ ఉంది.

మ‌రి ఇప్పుడు ఈ రెడ్డిగారిని మ‌రోసారి రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయించేందుకు కాంగ్రెస్ కు అవ‌కాశ‌మే క‌నిపించ‌డం లేదు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు కొద్దో గొప్పో స‌భ్యులను నామినేట్ చేయించే అవ‌కాశం ఉన్నా, ఏపీ నుంచి మాత్రం అవ‌కాశ‌మే లేదు. సుబ్బ‌రామిరెడ్డిని మ‌రో రాష్ట్రం నుంచి నామినేట్ చేయించే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో పోటీ తీవ్రంగా ఉంది. కాబ‌ట్టి ఈ కాంగ్రెస్ నేత‌కు రాజ్య‌స‌భ అవ‌కాశాలు దాదాపుగా లేన‌ట్టే.

కొన్నాళ్ల కింద‌ట సుబ్బ‌రామిరెడ్డి విష‌యంలో వేరే ప్ర‌చారం జ‌రిగింది. ఈయ‌న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అంద‌రి వాడిగా మెలిగే వ్య‌క్తి సుబ్బ‌రామిరెడ్డి. అందులోనూ కాంగ్రెస్ మాజీలు చాలా మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక అయ్యింది. కాబ‌ట్టి..
సుబ్బ‌రామిరెడ్డి చేరి ఉంటే పెద్ద ఆశ్చ‌ర్యం ఉండేది కాదేమో! కానీ అప్ప‌ట్లో ఆ చేరిక జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు చేరితే అవ‌కాశ‌వాది అనిపించుకుంటారు. అలాగ‌ని వైసీపీలో కూడా ఇప్పుడు ఈయ‌న‌కు అవ‌కాశం ల‌భించ‌డం క‌ష్ట‌మే. అక్క‌డ చాలా మంది చేరిపోయారు, రాజ్య‌స‌భ సీట్ల కోసం పోటీ ఉంది. ఈ క్ర‌మంలో సుబ్బ‌రామిరెడ్డికి అవ‌కాశం దాదాపుగా లేన‌ట్టే.

అయినా ఆయ‌న‌కు న‌ష్ట‌మేమీ లేదేమో! ఎందుకంటే.. ఆయ‌న‌కు బోలెడ‌న్ని వ్యాప‌కాలున్నాయి. బోలెడ‌న్ని వ్యాపారాలున్నాయి. సినిమా వాళ్ల‌తో సంద‌డిగా గ‌డుపుతూ ఉంటారు సుబ్బ‌రామిరెడ్డి. కాబ‌ట్టి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం అనేది కేవ‌లం హోదా మాత్ర‌మే. ఆ హోదా ఉన్నా లేక‌పోయినా ఆయ‌న ఎంచ‌క్కా త‌న ప‌నులు చూసుకోగ‌ల‌రేమో!