Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడిపై టీడీపీ తీవ్ర విమర్శలు!

By:  Tupaki Desk   |   16 March 2023 10:54 AM GMT
ఆ దర్శకుడిపై టీడీపీ తీవ్ర విమర్శలు!
X
రాంగోపాల్‌ వర్మ.. ప్రత్యేక పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఆయన సినిమాలు ఎంత వివాదాస్పదమో.. ఆయన ట్వీట్లు అంతకంటే వివాదాస్పదం. ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ సినిమాలు విడుదలవుతాయని టాక్‌. కాగా గత ఎన్నికల సమయంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తదితర సినిమాల ద్వారా టీడీపీని దెబ్బకొట్టాడు.. రాంగోపాల్‌ వర్మ.

ఇటీవల కాలంలో టీడీపీ, జనసేనలపై వివాదాస్పద ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు.. వర్మ. తాజాగా ఈ దర్శకుడు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక కార్యక్రమానికి వచ్చాడు. అక్కడ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రపంచమంతా అంతమై పోయి మగాళ్లంతా చచ్చిపోవాలని.. తానొక్కడిని బతకాలని వర్మ కోరుకున్నాడు. అప్పుడు ఈ ప్రపంచంలో తానొక్కడినే అందగాడినవుతానంటూ వ్యాఖ్యానించాడు.

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో రాంగోపాల్‌ వర్మపై టీడీపీ మండిపడింది. 'అడల్ట్‌ మూవీస్‌ తీసే రాంగోపాల్‌ వర్మను విద్యాలయానికి పిలవడమా.. ఇది నిజంగా సిగ్గుచేటు.. అసహ్యకరం. ఇలాంటి వ్యక్తిని యూనివర్సిటీకి పిలిచి వైస్‌ చాన్సలర్‌ విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?' అంటూ మండిపడింది. ఈ ట్వీట్‌ కు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే హ్యాష్‌ ట్యాగును జత చేసింది. అంతేకాకుండా వైసీపీ ఫాలోవర్‌ అంటూ రాంగోపాల్‌ వర్మను టీడీపీ పేర్కొనడం విశేషం.

కాగా గతంలో పవన్‌ కళ్యాణ్‌ పై వివాదాస్పద ప్రకటనలు చేయడం ద్వారా అందరి అటెన్షన్‌ ను రాంగోపాల్‌ వర్మ పొందేవాడు. అంతేస్థాయిలో పవన్‌ అభిమానులు కూడా రాంగోపాల్‌ వర్మను ఏకిపడేసేవారు. చివరకు నాగబాబు, మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సైతం వర్మపై గతంలో తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.

ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర కొస్తుండటంతో వర్మ మళ్లీ వైఎస్‌ జగన్‌ కు, ఆయన పార్టీకి సరిపోయే ఎజెండా ఆధారంగా ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. బూతు చిత్రాలు, హింసాత్మక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన వర్మను యూనివర్సిటీకి ముఖ్య అతిథిగా పిలవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వర్మ కూడా తానున్నది యూనివర్సిటీ అని మర్చిపోయాడు. యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మరణానంతరం స్వర్గానికి వెళితే, రంభ, ఊర్వశి లేరని గుర్తిస్తే నిరాశ చెందుతారని అన్నారు. కాబట్టి జంతువుల్లాగా ఈ భూమిపై మీ జీవితాన్ని మీరు 'ఎంజాయ్‌' చేయడం మంచిదని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ప్రతి ఒక్కరూ తన ఇష్టం వచ్చినట్లు జీవించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఉపాధ్యాయులు ఏమి బోధించారో పట్టించుకోకుండా తాగాలి, తినాలి, నిషేధించని లైంగిక సంబంధాలు కలిగి ఉండాలని విద్యార్థులకు హితబోధ చేశారు. దీంతో కొందరు విద్యార్థులు కూడా రాంగోపాల్‌ వర్మ మాటలకు చప్పట్లతో అభినందనలు తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.