Begin typing your search above and press return to search.

పొద్దున కేటీఆర్ తో భేటీ.. రాత్రికి రాజ‌కీయాల‌కు గుడ్ బై

By:  Tupaki Desk   |   28 March 2019 5:53 AM GMT
పొద్దున కేటీఆర్ తో భేటీ.. రాత్రికి రాజ‌కీయాల‌కు గుడ్ బై
X
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మొత్తంలో ఒకే ఒక్క టీడీపీ డివిజ‌న్ కార్పొరేట‌ర్ గా ఉన్న మందాడి శ్రీ‌నివాస‌రావు గురించి గుర్తుండే ఉంటుంది. గ్రేట‌ర్ మొత్తంలో ఒకే ఒక్క‌డుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. మిగిలిన కార్పొరేట‌ర్ల‌కు భిన్న‌మైన పంథాలో న‌డుస్తుంటార‌న్న పేరుంది. ఇవాల్టి రోజున మొన‌గాడు లాంటి నేత‌లు సైతం ఇట్టే పార్టీలు మారిపోవ‌టం కామ‌న్ అవుతున్న వేళ‌.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన ఈ చిన్న నేత గురించి తెలుసుకోవాల్సిందే.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని మొత్తం 150 డివిజ‌న్ల‌కు.. 150 మంది కార్పొరేట‌ర్లు ఉంటారు. 2016లో జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కేపీహెచ్ బీ కాల‌నీ డివిజ‌న్ కార్పొరేట‌ర్ గా టీడీపీ అభ్య‌ర్థి మంద‌డి శ్రీ‌నివాస‌రావు గెలిచారు. ఆయ‌న గెలుపు అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. ఆ త‌ర్వాత ఆయ‌న గులాబీ గూటికి చేర‌తార‌న్న మాట బ‌లంగా వినిపించింది. అయిన‌ప్ప‌టికీ పార్టీ మార‌కుండా త‌న‌కున్న ఒకే ఒక్క‌డు ఇమేజ్ తో బండి లాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గ్రేట‌ర్ ప‌రిధిలోని టీడీపీ నేత‌లంతా టీఆర్ ఎస్‌ లోకి చేరేందుకు రెఢీ అవుతున్న వేళ‌.. మంద‌డి కూడా పింక్ కారు ఎక్కేందుకు సిద్ధ‌మ‌య్యార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. దీనికి త‌గ్గ‌ట్లే బుధ‌వారం మ‌ధ్యాహ్నం వేళ ఆయ‌న టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను క‌లిశారు. అంతే.. ఆయ‌న టీఆర్ ఎస్ లో చేరిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చేశాయి.

అయితే.. తాను మ‌ర్యాద‌పూర్వ‌కంగా కేటీఆర్ ను క‌లిశానే త‌ప్పించి పార్టీలో చేరలేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డి వ‌ర‌కూ ఓకే అనుకుంటే.. ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ చోటు చేసుకుంది. కుక‌ట్ ప‌ల్లి టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు ఆఫీసు నుంచి ఒక అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.కేటీఆర్ ను క‌లిసిన మందాడి పార్టీ కండువా వేసుకోకున్నా.. ఆయ‌న పార్టీలో జాయిన్ అయిన‌ట్లేనంటూ ఒక ప్రెస్ రిలీజ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇలాంటి వేళ‌..ఒకేఒక్క‌డు పార్టీ మారారా? లేరా? అన్న‌ది సందేహంగా మారింది.

ఇలాంటి స‌మ‌యంలో ఒక ప్ర‌ముఖ మీడియాకు సంబంధించిన ప్ర‌తినిధి ఒక‌రు ఆయ‌న‌తో మాట్లాడ‌గా.. ఆయ‌న సంచ‌ల‌న విష‌యాన్ని ప్ర‌కటించారు. తాను తెలుగుదేశం పార్టీ ప‌ద‌వికి.. కార్పొరేట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని.. రాజ‌కీయాల నుంచి వైదొలుగుతున్న‌ట్లుగా చెప్పిన‌ట్లుగా పేర్కొన్నారు. మ‌ధ్యాహ్నం కేటీఆర్ ను క‌లిసిన మందాడి రాత్రి అయ్యేస‌రికి రాజ‌కీయాల నుంచే త‌ప్పుకోనున్న‌ట్లుగా చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ఎందుకిలా? అన్న ప్ర‌శ్న‌కు వ‌స్తున్న స‌మాధానం ఏమంటే.. తాజాగా జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయ‌టం లేద‌ని.. అలాంట‌ప్పుడు పార్టీలో ఉండ‌టం.. పార్టీ కార‌ణంగా వ‌చ్చిన ప‌ద‌విని ఉంచుకోవ‌టంలో అర్థం లేద‌ని.. అందుకే ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. మొద‌ట్నించి తెలుగుదేశంలో ఉన్న మందాడికి పార్టీ మార‌టం ఇష్టం లేద‌ని.. తాను పెట్టుకున్న‌ప్రిన్సిపుల్స్ కు పార్టీ మార‌టం విరుద్ధ‌మ‌ని.. అలా అని ప్ర‌స్తుత ప‌రిస్ధితుల్లో టీడీపీలో కొన‌సాగ‌లేని ప‌రిస్థితి ఉండ‌టంతో.. రాజ‌కీయాల నుంచే త‌ప్పుకుంటే మంచిద‌న్న‌నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. అనుకోకుండా వ‌చ్చిన ఒకే ఒక్క‌డి ట్యాగ్‌.. మందాడికి అతికిన‌ట్లుగా స‌రిపోతుంద‌న‌టంలో సందేహం లేదు.