Begin typing your search above and press return to search.

ఆనం చేరికతో ఫ్యాన్ గాలి రెట్టింపు

By:  Tupaki Desk   |   3 Sep 2018 7:30 AM GMT
ఆనం చేరికతో ఫ్యాన్ గాలి రెట్టింపు
X
మొత్తానికి ఆనం రామనారాయణ రెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో మూడు నెలల సస్పెన్స్‌ కు తెర పడింది. ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లా రాజకీయాలలో మంచి పట్టుంది. ఈ కుటుంబాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడూ అక్కున చేర్చుకున్నారు. ఒకవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఆనం కుటుంబం వల్ల ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు ఆ బలం అంతా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ వైపు వస్తుందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు జగన్ కూడా హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆనం చేరికతో నెల్లూరు జిల్లా రాజకాయాలు రసకందాయంలో పడ్డాయి. ఆనం చేరిక కారణంగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు పార్టీకి దూరం కానున్నారని, ముఖ్యంగా మేకపాటి వర్గీయులు కినుక వ‍హించారని వార్తలు వచ్చినా అవన్నీ పరిష్కరించిన తర్వతే జగన్ కొత్త చేరికలకు ఆహ్వానం పలికారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి నుంచి తనతో ఉన్న మేకపాటి వర్గీయులను జగన్ దూరం చేసుకోరని - మేకపాటికి - ఆయన వర్గీయులకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇస్తారని సార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తిరుపతి పార్లమెంటరీ కో ఆర్డినేటర్ల సమావేశం జరుగనుంది. ఇప్పటికే తిరుపతి పార్లమెంటరీ పరిధిలోని కో ఆర్డినేటర్లకు సమావేశం విషయాన్ని తెలియజేశారు. విశాఖ జిల్లాలో జగన్ పాదయాత్రలో ఉన్నారు. ఆయన పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ శిబిరంలోనే తిరుపతి పార్టమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఆనం చేరితో పాటు పలు అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీలోకి వచ్చే వారెవరితోనూ పాత వారికి ఇబ్బందులు ఉండవని జగన్ స్పష్టం చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్ధానిక నాయకుల మధ్య అనైక్యత నానాటికీ పెరుగుతోందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్ నాయకులకు సూచించనున్నారు. వచ్చే ఎన్నికల్లో వైెఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని - దీనిని ద్రష్టిలో ఉంచుకునే నాయకులందరూ సమష్టిగా పని చేయాలని జగన్ సూచిస్తున్నారు.