Begin typing your search above and press return to search.

ప‌లాస‌లో లోకేశ్‌ ప‌ర్య‌ట‌న‌.. వేడెక్కిన రాజ‌కీయం.. పోలీసుల దూకుడు

By:  Tupaki Desk   |   21 Aug 2022 9:30 AM GMT
ప‌లాస‌లో లోకేశ్‌ ప‌ర్య‌ట‌న‌.. వేడెక్కిన రాజ‌కీయం.. పోలీసుల దూకుడు
X
ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో రాజకీయ వేడి రాజుకుంది. 27వ వార్డు కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరామర్శించనున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై సూర్యనారాయణ విమర్శలు చేసిన అనంతరం అతనికి చెందిన ఇళ్లను అధికారులు కూల్చివేత చేపట్టారని పేర్కొంటూ.. దీనికి నిర‌స‌న‌గా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ అక్క‌డ ప‌ర్య‌టించి.. టీడీపీ శ్రేణుల‌కు నేత‌ల‌కు ద‌న్నుగా నిల‌వ‌నున్నారు.

ఇప్ప‌టికే విశాఖకు చేరుకున్న లోకేశ్‌ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మ‌రోవైపు.. పోలీసులు దూకుడు పెంచారు. పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేయలేదని ఎస్పీ జి.ఆర్‌.రాధిక తెలిపారు. అనుమతుల్లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

జంట పట్టణాల పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. విషయాన్ని ప్రజలు గమనించాలని ఎస్పీ వివరించారు. ఇదిలావుంటే,  శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ వద్ద టీడీపీ నేతలను పోలీసులు అడ్డగించారు. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, స్థానిక నేత చౌదరి బాబ్జీని అడ్డుకున్నారు. పలాసలో శుభకార్యానికి వెళ్తున్నామని పోలీసులకు తెలపగా.. అచ్చెన్నాయుడితో పాటు కారులో పోలీసులు కూడా వెళ్ల‌డం గ‌మ‌నార్హం.

అస‌లు ఏం జ‌రిగింది?

శ్రీకాకుళం జిల్లా పలాస శ్రీనివాసనగర్‌లోని 27వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు వాటిని తొలగించేందుకుప్ర‌య‌త్నించారు.  దీంతో ఆ ప్రాంతవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని.. విద్యుత్తు బిల్లు, ఇంటిపన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కూలగొడతామంటే తామంతా ఎక్కడికి వెళ్లాలంటూ అడ్డు తగిలారు.

అనంతరం అధికారులు పొక్లెయిన్‌తో 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ జి.సూర్యనారాయణ ఇంటి వద్దకు చేరుకుని తొలగించేందుకు సిద్ధమవటంతో జనం అక్కడా బైఠాయించారు. మంత్రికి విన్నవించాక కూడా తొలగించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇంతలో వైసీపీ నాయకులు అక్కడకి చేరుకోవటంతో ఇరు ప‌క్షాల నేత‌ల‌ మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ఈ క్ర‌మంలోనే లోకేశ్ అక్క‌డ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేశారు. మ‌రి ఏం జ‌ర‌గుఉతుందో చూడాలి.