Begin typing your search above and press return to search.

తండ్రి పక్కన నిలుచున్నారు.. కొడుకులిద్దరి మెడలో కండువాలు వేసిన జగన్

By:  Tupaki Desk   |   20 Sep 2020 1:08 PM GMT
తండ్రి పక్కన నిలుచున్నారు.. కొడుకులిద్దరి మెడలో కండువాలు వేసిన జగన్
X
అనుకున్నట్లే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఏపీ అధికారపక్షంలో చేరినట్లే చేరిన ఆయన.. అనర్హత వేటు పడకుండా ఉండేందుకు వీలుగా పార్టీ కండువా మాత్రం కప్పుకోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తన ఇద్దరు కొడుకుల్ని పార్టీలో చేర్చారు. తాను పార్టీలో చేరినా పార్టీ కండువా వేసుకోకుండా పక్కన నిలుచుండిపోయారు.

సాంకేతిక అంశాలు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు వీలుగా వ్యవహరించిన వాసుపల్లి తీరుపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. వాసుపల్లి కుమారులు ఇద్దరికి సీఎం స్వయంగా మెడలో పార్టీ కండువాలు వేశారు. దీంతో.. ఇద్దరు కొడుకులతో పాటు వాసుపల్లి అధికారపక్షం తీర్థం పుచ్చుకున్నట్లైంది.

పార్టీలో చేరిక సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వాసుపల్లి తీరుపై టీడీపీ నేతలు ఫైర్ అవుతూ.. అధికారపక్షంలో ఏం చేద్దామని వెళ్లినట్లు? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో సీనియర్ నేతలమైన తమ మాటల్ని కాదని.. వాసుపల్లి చెప్పిన మాటల్ని చంద్రబాబు వినేవారని.. ఆయనకు అంత గౌరవం ఇస్తే.. ఇప్పుడేమో కనీస మర్యాద లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.

సొంత పార్టీ నేతలకే సీఎం జగన్మోహన్ రెడ్డి టైమివ్వరని.. అలాంటిది ఏం చేద్దామని వాసుపల్లి అధికారపక్షంలో చేరారని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వారంతా ఇంట్లో ఖాళీగా కూర్చున్నారన్న అయ్యన్న.. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి తన పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరాలని సవాలు విసిరారు. ఇప్పుడిన్ని మాటలు అంటున్న అయ్యన్న.. తాము అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీలో చేరిన జగన్ పార్టీ నేతల చేత రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారా ఏంటి?