Begin typing your search above and press return to search.

బాబుకు షాక్:వైసీపీ గూటికి సిట్టింగ్ ఎంపీ

By:  Tupaki Desk   |   12 March 2019 9:06 AM GMT
బాబుకు షాక్:వైసీపీ గూటికి సిట్టింగ్ ఎంపీ
X
ఎన్నిక‌ల ముందు తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ త‌గిలింది. ముఖ్య నేత ఒక‌రు పార్టీ మారేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌త కొంత‌కాలంగా చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నరసింహం ఫ్యామిలీ పార్టీ మార్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. అనారోగ్య కారణాలతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే తోట నరసింహం ప్రకటించగా.. తన భార్యకు సీటు ఇవ్వాల‌ని కోరారు. అయితే, దానిపై క్లారిటీ రాకపోడంతో టీడీపీకి గుడ్‌ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. తోట దంపతుల నిర్ణయంతో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది.

కొద్దికాలం క్రితం తోట న‌ర‌సింహం ఆరోగ్యం గురించి వార్త‌లు వ‌చ్చాయి. ఆయ‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయన కలిశారు. అనంతరం తోట నరసింహం మీడియాతో మాట్లాడుతూ తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. తన ఆరోగ్యం బాగులేనందున తన కుటుంబంలో ఎవరో ఒకరికి జగ్గంపేట అసెంబ్లీ సీటు అడిగానని.. ఆలోచించి చెబుతానని సీఎం చెప్పారని తెలిపారు. గతంలో జగ్గంపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని.. తన అనుచరులంతా జగ్గంపేటలోనే ఉన్నారని ఆయన చెప్పారు. అయితే, టీడీపీ అధిష్టానం ఆయ‌న ప్ర‌తిపాద‌న‌ను ప‌క్క‌న‌పెట్టేసింది. దీంతో తోట కుటుంబం త‌మ దారి తాము చూసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

తోట న‌ర‌సింహం భార్య తోట వాణి పార్టీ మార్పు వార్తలపై ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ టీడీపీకి రాజీనామా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న భర్తకు జిల్లాలో సముచితస్థానం ఇవ్వకుండా అడ్డుపడింది హోంమంత్రి చినరాజప్పే అని ఆరోపించారు. తోట నరసింహం 15 ఏళ్లుగా జిల్లాలోకు ఎంతో సేవచేశారని... అయినా, పార్టీ అధిష్ఠానం మమ్మల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే తాము పార్టీ మారాల్సి వస్తోందని తెలిపారు. బుధ‌వారం వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్ సమ‌క్షంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతామని తెలిపారు. తాను పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని వెల్లడించిన తోట వాణి... గెలుపు మాదేనని ధీమా వ్యక్తం చేశారు.