Begin typing your search above and press return to search.

టీడీపీ కి మరో ఎదురుదెబ్బ .. మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు రాజీనామా !

By:  Tupaki Desk   |   11 March 2020 7:45 AM GMT
టీడీపీ కి మరో ఎదురుదెబ్బ .. మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు రాజీనామా !
X
గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన షాక్ నుండి టీడీపీ ఇంకా పూర్తిగా తేరుకోకముందే వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా కీలక నేతలందరూ టీడీపీని వీడుతున్నారు. నిన్న (మంగళవారం ) టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సీఎం సంక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఆ తరువాత జమ్మలమడుగు టీడీపీ కీలక నేత రామసుబ్బారెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి ..వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సీఎం తో భేటీ కావడానికి ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. అలాగే పులివెందులకు చెందిన సీనియర్ నాయకుడు ఎస్వీ సతీష్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ రోజు (బుధవారం ) మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పార్టీకి రాజీనామా చేసారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు పంచకర్ల ప్రకటించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనే కారణంతో విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా రాజధానిగా ప్రకటించారని, దాన్ని వ్యతిరేకించడం సరి కాదని అన్నారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చడాన్ని స్వాగతిస్తోన్న సీనియర్ నాయకులను లెక్క చేయట్లేదని ఆరోపించారు. విశాఖపట్నం లాంటి వెనుకబడిన ప్రాంతాంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడాన్ని పార్టీ నాయకులు స్వాగతించి ఉండాల్సిందని అయన అభిప్రాయ పడ్డారు.

ఇకపోతే , పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. రమేష్‌బాబు 2019 ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓడారు. ఎన్నికల్లో రూరల్‌లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాక పోవడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.. తర్వాత పార్టీ కార్యక్రమాలకు గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలోనే టీడీపీ కి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈయన నియోజకవర్గంలో అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశం కానున్నారు.. వారితో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. అయితే , పంచకర్ల రమేష్ బాబు రెండు, మూడు రోజుల్లోనే వైఎస్సార్‌సీపీ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.