Begin typing your search above and press return to search.

బొబ్బిలి యుద్ధానికి మాజీ మంత్రి దూరం...టీడీపీ ప్లాన్ అదే...?

By:  Tupaki Desk   |   12 Sep 2022 12:30 AM GMT
బొబ్బిలి యుద్ధానికి  మాజీ మంత్రి దూరం...టీడీపీ ప్లాన్ అదే...?
X
విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకమైన బొబ్బిలి నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అన్నది ఒక ఆసక్తికరమైన చర్చకు తెర తీస్తోంది. బొబ్బిలి చాలా ప్రతిష్టాత్మకమైన సీటు. ఇక్కడ నుంచి పలు మార్లు బొబ్బిలి వారసులు అయిన సుజయ‌ క్రిష్ణ రంగారావు గెలిచారు 2019లో ఫస్ట్ టైం ఆయన ఓడారు. దానికి ముందు ఆయన కాంగ్రెస్, వైసీపీల నుంచి నెగ్గారు. అయితే 2017లో ఆయన వైసీపీ నుంచి టీడీపీకి జంప్ అయి మంత్రిగా పనిచేశారు. అయితే అది బొబ్బిలి జనాలకు నచ్చలేదు. దాంతో మంత్రిగా పోటీ చేసిన ఆయన మీద రాజకీయంగా అప్పటికి కొంత చురుకు తగ్గిన శంబంగి చిన అప్పలనాయుడుని పోటీకి పెడితే బంపర్ మెజారిటీతో నెగ్గేశారు.

ఆ తరువాత మాజీ మంత్రి సుజయక్రిష్ణ రంగారావు బొబ్బిలి వైపు పెద్దగా తొంగి చూడలేదు. ఆయన ఎక్కువగా విశాఖలోనే గడిపేశారు. ఆయన ఎందుకో రాజకీయాల పట్ల విముఖంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆయన తమ్ముడు బేబీ నాయనకే బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. ఇక ఆయనే మూడేళ్ళుగా పార్టీని అక్కడ నడిపిస్తున్నారు. బొబ్బిలి మునిసిపాలిటీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయంటే బేబీ నాయన పట్టుదల కారణం.

ఒక విధంగా ఇపుడు బొబ్బిలిలో రాజకీయ పరిస్థితులు మారాయి. బొబ్బిలిలో టీడీపీకి సానుకూలత కనిపిస్తోంది. దాంతో ఈసారి బేబీ నాయన‌ పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆయనతో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి పోటీ చేస్తారా లేక కొత్తవారిని వైసీపీ బరిలోకి దించుతుందా అన్నది చూడాలి. వైసీపీ చేయించుకున్న అంతర్గత సర్వేలో బొబ్బిలి లో ఆ పార్టీ వెనకబడినట్లుగా తెలుస్తోంది.

ఇక శంబంగి కూడా సీనియర్ నేత అయిపోయారు. బేబీ నాయన మీద దూకుడు చూపించాలీ అంటే యువ నేత అవసరం అని వైసీపీ అంటోంది. ఈ పరిణామాలతో బొబ్బిలిలో ఇపుడు టీడీపీకి ఎడ్జ్ క‌నిపిస్తోంది. దాంతో వైసీపీ కూడా ఫోకస్ పెంచుతోంది. బేబీ నాయన రాజకీయంగా ముందుండడం మాత్రం సైకిల్ పార్టీకి కలసివచ్చే అంశమే అని అంటున్నారు. ఇదిలా ఉండగా మాజీ అమంత్రి సుజయ క్రిష్ణ రంగారావు రాజకీయాల నుంచి పూర్తిగా దూరమవుతున్నారా లేక ఆయన్ని చంద్రబాబు విజయ‌నగరం నుంచి ఎంపీ సీటుకు పోటీ చేయిస్తారా అన్నది కూడా ఆ పార్టీలో చర్చగా నడుస్తోందిట.