Begin typing your search above and press return to search.

శోక సంద్రంలో టీడీపీ.. ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   5 March 2023 9:35 AM
శోక సంద్రంలో టీడీపీ.. ఏం జ‌రిగిందంటే!
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని వ‌రుస క‌ష్టాలు కుమ్మేస్తున్నాయి. నాయ‌కులు నేల‌రాలుతున్నారు. ఇటీవ‌లే గ‌న్న‌వ‌రం పార్టీ ఇంచార్జ్‌...ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. సుదీర్ఘ‌కాలం పార్టీలో సేవ‌లందించిన అర్జునుడు.. అనారోగ్యం కార‌ణంగా తుదిశ్వాస విడిచారు. ఈ బాధ నుంచి పార్టీ ఇంకా కోలుకోక ముందే.. ఇప్పుడు మ‌రో కీల‌క నేత హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు.

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రిజిల్లా(కాకినాడ)లోని ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ వరుపుల రాజా(47) శనివారం అర్ధ రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఈయన కొద్దిరోజులుగా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొని, శనివారం సాయంత్రం స్వగ్రామం ప్రత్తిపాడు చేరుకున్నారు. పార్టీ శ్రేణులు, బంధువులతో రాత్రి 8.30 గంటల వరకు మాట్లాడారు.

అనంతరం తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన్ను హుటాహుటిన కాకినాడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

తాము ఎంతగా శ్రమించినా ఫలితం లేకపోయిందని, రాత్రి 11.20 గంటలకు వరుపుల రాజా కన్నుమూసినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ఆయనకు గతంలో రెండుసార్లు గుండెపోటు రావడంతో స్టంట్లు వేశారు.

ప్రత్తిపాడు మండల అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజా.. డీసీసీబీ ఛైర్మన్‌గా, ఆప్కాబ్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.

చురుకైన నేత హఠాన్మరణంతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. కాగా.. వ‌రుసగా జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.