Begin typing your search above and press return to search.

టీడీపీలో అనంత ఆశలను పెంచేస్తున్న లోకేష్

By:  Tupaki Desk   |   8 April 2023 8:00 AM GMT
టీడీపీలో అనంత ఆశలను పెంచేస్తున్న లోకేష్
X
నారా లోకేష్ కేరాఫ్ చంద్రబాబుగానే ఉంటూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. లోకేష్ పాదయాత్ర గత రెండున్నర నెలలుగా సాగుతోంది. ఇప్పటికి రెండు జిల్లాలలో పాదయాత్ర సాగుతూ వస్తోంది. లోకేష్ పాదయాత్రకు మొదట్లో పెద్దగా స్పందన కనిపించకపోయినా నెమ్మదిగా క్రేజ్ పెరుగుతోంది అని అంటున్నారు.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ టీడీపీ వైపు టర్న్ కావడంతో లోకేష్ ప్రభావం సీమ జిల్లాలలో బాగానే ఉందని టీడీపీతో పాటు వైసీపీకి అర్ధమైంది. ముఖ్యంగా టీడీపీకి చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న యువతను ఆకట్టుకోవడంలో లోకేష్ సక్సెస్ అయ్యారని అంటున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర జోష్ నింపింది. అక్కడ టీడీపీకి 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు లభించింది. ఇక అనంతపురం జిల్లలో చూస్తే రెండు సీట్లు వచ్చాయి. అంటే పూర్తిగా జగన్ వేవ్ లో కొట్టుకుపోయిన జిల్లాలలో లోకేష్ ఎదురీత చేస్తూ పాదయాత్ర సాగిస్తున్నారు అన్న మాట. ఈ పాదయాత్రకు జనాలు కూడా పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ శ్రేణులలో ఉత్సాహం వెల్లి విరుస్తోంది.

ఇంకో వైపు చూస్తే పార్టీ నాయకుల మధ్యన కూడా సయోధ్య పెరుగుతోంది. టీడీపీ గెలుస్తుంది అన్న ధీమాను రాయలసీమ ప్రాంతంలో పెంచగలిగారు లోకేష్ అని అంటున్నారు. పాదయాత్ర ప్రభావం ఏమీ ఉండదని భావించిన అధికార పార్టీకి కూడా ఇది మింగుడు పడడం లేదు అంటున్నారు. అందుకే లోకేష్ ఎక్కడ మీటింగ్ పెట్టినా వెంటకే కౌంటర్ కూడా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇస్తున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే గతంలో వైసీపీ చేతిలో చావు దెబ్బ తిన్న నియోజకవర్గాలలో లోకేష్ పాదయాత్రకు పోటెత్తుతున్న జనం దేనికి సంకేతం అన్నది కూడా వైసీపీ ఆలోచనలోపడిపోయేలా పరిస్థితి ఉందని అంటున్నారు. చిత్తూరు జిల్లాలో అయితే పీలేరు, పలమనేరులలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ లోకేష్ పాదయాత్రకు వచ్చింది అని అంటున్నారు.

ఇక అనంతపురంలో చూసుకుంటే కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, అనంత అర్బన్, ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాలలో సైకిల్ పార్టీలోని స్తబ్దతను తొలగించారు లోకేష్. అదే టైం లో రాప్తాడు ధర్మవరంలో అంతా వన్ సైడెడ్ గా సాగుతున్న రాజకీయాన్ని బ్యాలెన్స్ చేశారు అని అంటున్నారు. ఇలా కనుక చూసుకుంటే గతంలో కేవలం రెండు సీట్లు వచ్చిన అనంతలో కానీ ఒక సీటే వచ్చిన చిత్తూరులో కానీ ఈసారి సమీకరణలు పూర్తిగా మారుతాయని అంటున్నారు.

ఇక ముందు ముందు కర్నూల్ జిల్లా కడపలలో లోకేష్ పాదయాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్న చర్చ ఉంది. రాయలసీమలో మొత్తం 52 సీట్లు ఉన్నాయి. స్వీప్ చేసి పారేసినట్లుగా కేవలం మూడంటే మూడు టీడీపీకి వదిలేసి 49 సీట్లను వైసీపీ 2019 ఎన్నికల్లో గెలుచుకుంది. అయితే 2024 లో మాత్రం అలాంటి సీనే ఉండదని అంటున్నారు. ఈసారి కచ్చితంగా తెలుగుదేశం పదిహేను నుంచి ఇరవై సీట్ల దాకా గెలుచుకుంటుంది ఆంటున్నారు. ఇదే కనుక జరిగితే ఏపీలో టీడీపీదే అధికారం అని కూడా అంటున్నారు. మొత్తానికి రాయలసీమ అంటే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అలాంటి చోట లోకేష్ పాదయాత్ర బాగానే ప్రభావం చూపిస్తోంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.