Begin typing your search above and press return to search.

ఆప‌రేష‌న్ వివేక్‌..టీఆర్ ఎస్‌ లో కొత్త క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   2 Jan 2019 2:32 PM GMT
ఆప‌రేష‌న్ వివేక్‌..టీఆర్ ఎస్‌ లో కొత్త క‌ల‌క‌లం
X
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ ఎస్‌ లో కొత్త‌ సీన్ తెర‌మీద‌కు వ‌చ్చింది. బ్రాహ్మండ‌మైన మెజార్టీతో గెలుపొందిన‌ టీఆర్‌ ఎస్ పార్టీ ఇప్పుడు పోస్టుమార్టం మొదలు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన వారిపై చర్యలు తీసుకునేపనిలో పడింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతల జాబితాలు తయారు చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఈ విషయం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇందులో ప్ర‌ధానంగా మాజీ ఎంపీ - తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ అంత‌రాష్ట్ర స‌ల‌హాదారు జి.వివేక్ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఒక్క సీటు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో టీఆర్‌ ఎస్‌ విజయం సాధించింది. గెలిచిన నియోజకవర్గాల్లో కూడా కొందరు నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. లేకపోతే మెజార్టీ ఇంకా ఎక్కువ వచ్చేదన్న వాదాన్ని సమావేశాల్లో లేవనెత్తుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా టీఆర్ ఎస్‌ పార్టీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ త‌రుణంలో పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్‌ ఎస్‌ శ్రేణులన్నీ ఇప్పుడు వివేక్‌ ను టార్గెట్‌ చేస్తున్నాయి. బెల్లంపల్లిలో వివేక్‌ సోదరుడు వినోద్‌ ఇండిపెండెంట్‌ గా పోటీ చేయడంతో అక్కడ టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు మెజార్టీ తగ్గిందన్న నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చింది. ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ ఎస్‌ సమావేశంలో ఈ అంశంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వివేక్‌ సహకరించకపోవడం వల్లే కొప్పుల ఈశ్వర్‌ స్వల్ప మెజారిటీతో గట్టెక్కారని కార్యకర్తలు ప్రస్తావించారు. ఈశ్వర్‌ ను ఓడించేందుకు వివేక్‌ మూడు కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. వివేక్‌ ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మంథనిలో టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు ఓడిపోయారు. వివేక్‌ కుట్రతోనే పుట్ట మధు ఓడిపోయారని టీఆర్‌ ఎస్‌ కార్యకర్తలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. రామగుండంలో టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు వ్యతిరేకంగా వివేక్‌ పనిచేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఇండిపెండెంట్‌ అభ్యర్థి కోరుకంటి చందర్‌ కు మద్దతు ఇవ్వడంతోపాటు ఆర్థికంగా సహాయం చేయడంతో సోమారపు సత్యనారాయణ ఓడిపోయినట్టు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి.

పార్టీ విస్తృతస్థాయి సమావేశాల వేదిక‌గా వివేక్‌ పై ఎదురుదాడి జ‌రుగుతోంది. చెన్నూరు నుంచి పోటీ చేసిన బాల్క సుమన్‌ కు వివేక్‌ తో ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. దీంతో వివేక్‌ అందరికీ టార్గెట్‌ అయ్యారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ ఎస్‌ సమావేశంలో కూడా కోవర్టులపై చర్చ జరిగింది. ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కొందరు నాయకులు పనిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఉపేక్షించొద్దని ఈటల రాజేందర్ తెగేసి చెప్పారు. దీంతో కోవర్టుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. స్థూలంగా పార్లమెంటు ఎన్నికల్లో వివేక్‌ కు టికెట్ క‌ష్టంగా ప‌రిణామాలు మారుతున్నాయ‌ని అంటున్నారు.