Begin typing your search above and press return to search.

టీఎస్ ఆర్టీసీ కొత్త ప్రయోగం.. టికెట్ తో పాటు చిరుతిళ్ల బాక్స్

By:  Tupaki Desk   |   27 May 2023 8:13 AM GMT
టీఎస్ ఆర్టీసీ కొత్త ప్రయోగం.. టికెట్ తో పాటు చిరుతిళ్ల బాక్స్
X
రోటీన్ కు భిన్నమైన దూకుడును ప్రదర్శిస్తోంది టీఎస్ ఆర్టీసీ. వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్న ఈ సంస్థ.. ఇటీవల కాలంలో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటోంది. కొత్తగా ఈ బస్సులను భారీగా తీసుకురావటమే కాదు.. దూర ప్రాంతాల సర్వీసులను సంప్రదాయ ఇంధనంతో కాకుండా.. విద్యుత్ బస్సులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్న టీఎస్ ఆర్టీసీ తాజాగా మరో ప్రయోగానికి తెర తీసింది.

ఈ మధ్యన టీఎస్ ఆర్టీసీ కొత్తగా ఈ- గరుడ బస్సుల్ని హైదరాబాద్ - విజయవాడ మధ్యన నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు అర లీటర్ వాటర్ బాటిల్ ను ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూట్లో తొమ్మిది సర్వీసుల్ని నడుపుతున్న ఆర్టీసీ.. ఈ రోజు (శనివారం) నుంచి టికెట్ తో పాటు స్నాక్స్ బాక్స్ ను సైతం అందించే ఏర్పాటు చేసింది. తమ కొత్త ప్రయోగం విజయవంతమైతే.. దూర ప్రాంతాలకు తిరిగే అన్ని ఇతర సర్వీసుల్లోనూ ఈ తరహా బాక్సుల్ని ప్రయాణికులకు అందించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు చెబుతున్నారు.

అయితే.. ఈ బస్సుల్లో అందించే స్నాక్స్ బాక్స్ కు ప్రయాణికుల నుంచి రూ.30 వసూలు చేయనున్నారు. ప్రయాణికుడికి ఈ స్నాక్స్ బాక్స్ అవసరం ఉందా? లేదా? అన్నది పక్కన పెట్టేసి.. అందరికీ దీన్ని ఇస్తారు. ఇంతకీ ఈ స్నాక్స్ బాక్స్ లో ఏం ఉంటుంది?అన్న విషయంలోకి వెళితే.. చిరుధాన్యాలతో చేసిన ఖాక్రా (25 గ్రాముల బరువు), చిక్కీ (20 గ్రాములు).. మౌత్ ఫ్రెషనర్ (10 గ్రాములు).. టిష్యూ పేపర్లు ఉంటాయని చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న దీనిపై ప్రయాణికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. వారిచ్చే సలహాలు.. సూచనల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్నారు. అంతా బాగుంది కానీ.. టికెట్ మీద అదనంగా రూ.30వసూలు చేయటమే బాగోలేదన్న మాట వినిపిస్తోంది.