Begin typing your search above and press return to search.

టీఎస్ఆర్టీసీ వారి స్లీపర్ బస్సు పేరే కాదు.. వసతులు సైతం సూపర్

By:  Tupaki Desk   |   27 March 2023 9:38 AM GMT
టీఎస్ఆర్టీసీ వారి స్లీపర్ బస్సు పేరే కాదు.. వసతులు సైతం సూపర్
X
స్లీపర్ ప్రైవేటు బస్సులు వచ్చి ఎంతో కాలమైంది. చివరకు ఏపీలో ఆర్టీసీ సంస్థ స్లీపర్ బస్సుల్ని ప్రవేశ పెట్టి కూడా చాలాకాలమే అయ్యింది. అయినప్పటికీ స్లీపర్ బస్సుల్ని ప్రసమకూర్చుకునే విషయంలో తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ మాత్రం విపరీతమైన ఆలస్యాన్ని చేసింది. ఏళ్ల తరబడి వెనుకబడి ఉన్న ఈ సంస్థ తాజాగా స్లీపర్ బస్సుల్ని తీసుకొచ్చింది. తాజాగా పదహారు ఏసీ స్లీపర్ బస్సుల్ని పరుగులు తీయించేందుకు వీలుగా సిద్ధం చేసింది.

లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చే సిద్ధాంతానికి తగ్గట్లు.. మిగిలిన బస్సులతో పోలిస్తే.. మెరుగైన సౌకర్యాలతో తన కొత్త ఏసీ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైటెక్ హంగులతో ఉన్న ఈ బస్సుల్లో ఉచిత వైఫైను అందిస్తున్నారు. మొత్తం 30 మంది ప్రయాణించేందుకు వీలుగా ఉంటే ఈ ఏసీ స్లీపర్ బస్సులకు లహరి - అమ్మఒడి అనుభూతి' అన్న పేరును పెట్టటం ద్వారా అందరిని ఆకర్షిస్తున్నారు.

అమ్మఒడికి ఉన్న ప్రాధాన్యత ఎంతో తెలుసు. అలాంటి అనుభూతిని సొంతం చేసేలా తమ కొత్త బస్సుల్లో ప్రయాణం అన్న విషయాన్ని చెప్పేలా కొత్త బస్సులకు హంగుల్ని సిద్ధం చేశారు. ఈ కొత్త ఏసీ స్లీపర్ బస్సుల్ని విశాఖపట్నం.. తిరుపతి.. చెన్నై.. బెంగళూరు.. హుబ్బళ్లి మార్గాల్లో నడపనున్నారు. ఈ కొత్త బస్సుల్లో పలు సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ప్రయాణికుల భద్రత కోసం బస్సు ట్రాకింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. బస్సుల్లో పానిక్ బటన్ సదుపాయం ఉంది.

బస్సుకు రివర్సు పార్కింగ్ అసిస్టెన్స్ కెమేరా ఉంటుంది. బస్సు లోపల సెక్యూరిటీ కెమెరాలు.. ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టంతో పాటు.. ప్రయాణికులకు ఏదైనా సమాచారం అందించేందుకు వీలుగా.. పబ్లిక్ అడ్రెస్ సిస్టం ఉంటుంది.

ప్రతి బెర్త్ కు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు.. రీడింగ్ ల్యాంపుల్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏమైనా.. ఈ కొత్త బస్సుల గురించి తెలిసినంతనే.. ఒకసారి ప్రయాణం చేయాలన్న భావన కలిగేలా ఉన్నాయని మాత్రం చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.