Begin typing your search above and press return to search.

ఆ సీఎం పేరును ఆ క్రికెటర్.. ఆ నటుడు తెగ వాడేస్తున్నారట

By:  Tupaki Desk   |   2 Nov 2020 3:30 AM GMT
ఆ సీఎం పేరును ఆ క్రికెటర్.. ఆ నటుడు తెగ వాడేస్తున్నారట
X
తాజాగా జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. తొలుత నల్లేరు మీద నడకలా భావించినా.. అందుకు భిన్నంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. మరోరోజులో (నవంబరు 3న) జరగనున్న ఎన్నికలు బిహార్ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కించాయి. ఇదిలా ఉండగా.. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య ఒకటి ఆసక్తికరంగా మారాయి.

తన పేరును ఒక క్రికెటర్.. ఒక నటుడు తెగ వాడేస్తున్నారని పేర్కొన్నారు. పబ్లిసిటీ కోసం తన పేరును వాడేస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు. ఇంతకీ.. సీఎం నితీశ్ చెప్పిన క్రికెటర్.. యాక్టర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ.. వారిద్దరు ఎవరో కాదు.. ఒకరు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అయితే.. మరొకరు లోక్ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వాన్. తేజస్వీకి క్రికెట్ కు సంబంధం ఏమంటారా? స్వతహాగా క్రికెటర్ కావటమే కాదు.. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో ఉండేవాడు. 2008 ఐపీఎల్ సీజన్ లో పాల్గొన్నా.. ఒక్క మ్యాచ్ లో కూడా ఆడకుండా బెంచ్ కే పరిమితమయ్యారు. తర్వాతి కాలంలో క్రికెట్ కు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చారు.

ఇక.. చిరాగ్ పాశ్వాన్ విషయానికి వస్తే పలు సినిమాల్లో నటించారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనాతో 2011లో ఒక సినిమాలో నటించాడు. మిలే నా మిలే హమ్ అనే సినిమాలో నటించిన ఆయన సినీ రచయితగా సుపరిచితులు. ఈ ఇద్దరు నేతలు తన పేరును తమ ఎన్నికల ప్రచారంలో విపరీతంగా వాడేస్తున్నట్లుగా నితీశ్ పేర్కొన్నారు. అయితే.. ఆయన వ్యాఖ్యలపై చిరాగ్ తీవ్రంగా మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే.. నితీశ్ ను జైలుకు పంపుతానని చెబుతున్నారు. ‘‘7నిశ్చయ్’’ పథకంలో భారీగా అవినీతి జరిగిందని.. అధికారంలోకి వచ్చినంతనే ఆ అంశంపై విచారణ జరిపిస్తానని పేర్కొనటం సంచలనంగా మారింది. మొత్తంగా.. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో బిహార్ రాజకీయం ఫుల్ గా వేడెక్కిపోయిందని చెప్పక తప్పదు. మరి.. బిహార్ ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.