Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది: వైసీపీ కార్పొరేటర్‌ సంచలన ఆరోపణలు!

By:  Tupaki Desk   |   7 Feb 2023 10:05 AM GMT
ఆ ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది: వైసీపీ కార్పొరేటర్‌ సంచలన ఆరోపణలు!
X
వైసీపీ కంచుకోట అయిన నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పెద్దా రెడ్లు ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ ఫోన్లు ట్యాపింగ్‌ కు గురయ్యానని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలు సంచలన ఆరోపణలు వైసీపీలో సంచలనానికి కారణమయ్యాయి.

గత కొన్ని రోజులుగా తనపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. ఈ క్రమంలో తనపై కేసులు పెట్టుకోవాలని.. అరెస్టు చేయించాలని ఆయన సవాల్‌ విసిరారు. తన గొంతు ఆగిపోతే తప్ప తాను మాట్లాడటం ఆపనన్నారు. అందుకని తనను అరెస్టు చేసి ఎన్‌కౌంటర్‌ చేసుకోవాలని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.

ఇంకా ఎన్నికలకు ఏడాది ముందే తాను బయటకొస్తున్నానని.. తనపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తారని కోటంరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తద్వారా తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతారని విమర్శించిన సంగతి తెలిసిందే. జైళ్లు చాలా మందికి అచ్చి వచ్చాయని.. తనను అరెస్టు చేసినా భయపడబోనని తెలిపారు. ఆయన ఊహించినట్టే కోటంరెడ్డిపై కేసుల పర్వం మొదలైపోయింది.

తనతో పాటు పార్టీ మారలేదన్న అక్కసుతో ఓ కార్పొరేటర్‌ను నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కిడ్నాప్‌నకు యత్నించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. శ్రీధర్‌రెడ్డి పడారుపల్లికి చెందిన నెల్లూరు నగరం 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మూలే విజయభాస్కర్‌ రెడ్డికి ఫోన్‌ చేసి వైఎస్సార్‌సీపీని వీడి తనతో రావాలని కోరారు.

అందుకు విజయభాస్కర్‌ రెడ్డి తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి తన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, కారు డ్రైవర్‌ అంకయ్యతో కలిసి కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి అంతు చూస్తానంటూ బెదిరించారని పోలీసులు చెబుతున్నారు.

కార్పొరేటర్‌ను బలవంతంగా కారులో ఎక్కించేందుకు కోటంరెడ్డి అనుచరులు ప్రయత్నించగా కార్పొరేటర్‌ విజయభాస్కర్‌ రెడ్డి ప్రతిఘటించారని వివరించారు. వారి నుంచి తప్పించుకున్న కార్పొరేటర్‌ వేదాయపాలెం పోలీసుస్టేషన్‌కు చేరుకుని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కార్పొరేటర్‌ విజయ భాస్కర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు, కారు డ్రైవర్‌పై కిడ్నాప్‌యత్నం కేసు నమోదు చేసినట్లు వేదాయ­పాలెం ఇన్‌స్పెక్టర్‌ కె.నరసింహారావు తెలిపారు.

కాగా కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని నెల్లూరు 22వ డివిజన్‌ కార్పొరేటన్‌ మూలె విజయ్‌ భాస్కర్‌ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి కార్యాలయంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మూలె విజయ్‌ భాస్కర్‌ రెడ్డి తాను వైసీపీలోనే కొనసాగుతానని చెప్పడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి తన ఇంటికి వచ్చి తనను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

కొత్త వ్యక్తులు తన కార్యాలయం వద్ద తిరుగుతున్నారని.. వారితో తనకు ప్రాణభయం ఉందన్నారు. తనకు రక్షణ కల్పించాలని కార్పొరేటర్‌ విజయ్‌ భాస్కర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తాను, తన డివిజన్‌ లోని నాయకులు, కార్యకర్తలంతా వైఎస్‌ జగన్‌ వెంటనే నడుస్తామని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు కోటంరెడ్డి కథనం మరోలా ఉంది. ఆయన మీడియాను పిలిచి.. లైవ్‌ లో తన ఫ్లెక్సీలు చించుతున్నారని తెలిసి ఇంతలోనే ఏమైందో తెలుసుకోవడానికే తాను కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లానని తెలిపారు. విజయ్‌ భాస్కర్‌ రెడ్డి తనను ఇంటిలోపలకి తీసుకెళ్లి టీ కూడా ఇచ్చారని.. విజయ్‌ భాస్కర్‌ రెడ్డి భార్య కూడా జరుగుతున్న పరిణామాల పట్ల అన్నా మీకు ఇలా జరగడం బాధగా ఉందని కంటతడి పెట్టిందన్నారు.

తాను విజయ భాస్కర్‌ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన తనను కారు వద్దకు వచ్చి కారు ఎక్కేముందు తనను కౌగిలించుకుని ఏడ్చారని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఇటీవల వెల్లడించారు. తాను మీరు ఎటు ఉంటే అటే ఉంటానని విజయ్‌ భాస్కర్‌ రెడ్డి అన్నారని.. ఇంతలోనే ఫ్లేటు ఫిరాయించి తాను బెదిరించినట్లు కిడ్నాప్‌ కేసు పెట్టడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.