Begin typing your search above and press return to search.

2027లో యుగాంతం.. మళ్లీ మొదలెట్టేశారు

By:  Tupaki Desk   |   4 April 2023 10:19 AM GMT
2027లో యుగాంతం.. మళ్లీ మొదలెట్టేశారు
X
ప్రశాంతంగా ఎవరి బతుకు వారు బతుకుతుంటే కొందరికి ఇష్టం ఉండదా? తమకున్న పైత్యాన్ని ప్రపంచం మీద రుద్దితే కానీ నిద్ర పట్టదా? లాంటి సందేహాలు కొన్ని పోస్టుల్ని చూసినప్పుడు కలుగక మానదు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే వస్తుంది. కొన్నాళ్ల క్రితం 2012లో యుగాంతం ఖాయమన్న భారీ ప్రచారాన్ని తీసుకొచ్చి. కొన్నిరోజుల పాటు దీని పై బోలెడంత చర్చ జరిగేలా చేశారు. ఈ ప్రచారాన్ని కొందరు నమ్మేసి తీవ్ర భయాందోళనలకు గురైన దుస్థితి.

ఇలాంటి అబద్ధాల్ని ప్రచారం చేసేందుకు అందరిని నమ్మించేందుకు వీలుగా కొన్ని లాజిక్కుల్ని తెర మీదకు తీసుకొస్తారు. 2012లో యుగాంతం అన్న విషయాన్ని అందరూ నమ్మేందుకు వీలు గా వినిపించిన వాదన ఏమంటే.. మయాంగ్ క్యాలెండర్ 2012లో ముగియటంతో. ప్రపంచం అంతం అవుతుందన్న ప్రచారాన్ని జోరు గా షురూ చేశారు. 2012 పోయి ఇప్పుడు 2023లో ఉన్నాం. అందరూ సుబ్బరంగా ఉన్నారు కూడా.

ఇప్పుడు అలాంటిదే మరో కొత్త ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. టైమ్ ట్రావెలర్ గా చెప్పుకునే మారియా. జెవియర్ల జంట మరో నాలుగేళ్లలో ప్రపంచం అంతం అవుతుందని పేర్కొంటూ. అందుకు సంబంధించిన వీడియోను సాక్ష్యంగా చూపిస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో ఎక్కడిదంటే. తాము భవిష్యత్తులో కి వెళ్లి చూసొచ్చామని చెబుతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు భవిష్యత్తులోకి వెళ్లి వర్తమానానికి తిరిగి రావటం అన్నది సినిమాల్లో ఫిక్షన్ రూపంలో చూపించటమే కానీ వాస్తవంగా అలాంటిది ఇప్పటి వరకు జరిగింది లేదు.

ఇంతకీ తాజా యుగాంతం ఎపిసోడ్ ను అందం గా తెర మీదకు తీసుకొచ్చిన ఈ జెవియర్.. మారియాలు ఎవరు? అన్న ప్రశ్న వేస్తే.. వారు టిక్ టాక్ యూజర్లు. టిక్ టాకర్ జెవియర్ పేరుతో వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా వారు ఒక వీడియోను షేర్ చేశారు. తాము టైమ్ ట్రావెల్ చేశామని.. 2027లొకి వెళ్లి చూస్తే.. భవనాలన్నీ పాడుపడిపోయాయని.. వాహనాలు ఎక్కడికక్కడ నిలిపేసి ఉన్నాయని.. తాము ఇద్దరం తప్పించి.. మరింకేమీ లేవని పేర్కొన్నారు. తాము ఫ్యూచర్ లోకి వెళ్లి షూట్ చేసి..తాజాగా అప్ లోడ్ చేసిన వీడియో స్పెయిన్ ప్రాంతానికి చెందినట్లు గా పేర్కొన్నారు.

తాము షూట్ చేసిన వీడియో డేట్ ను వారు చెప్పటం గమనార్హం. తాము2027 ఫిబ్రవరి 13న షూట్ చేశామని చెప్పారు. ఐదేళ్లలో ఈ భూమి పరిసమాప్తమవుతుందని చెప్పుకొచ్చారు. దక్షిణ అమెరికాలోని ఒక గ్రామంలో గ్రహాంతరవాసి డెడ్ బాడీని చూశామని.. అంతలోనే మాయమైందంటూ మాంచి మసాలా స్టోరీని వినిపిస్తున్నారు. వీరి పుణ్యమా అని మళ్లీ యుగాంతం ముచ్చట మొదలైంది. రానున్న రోజుల్లో మరెన్ని వెర్రితలలు వేస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.