Begin typing your search above and press return to search.

పిక్‌ వైరల్‌.. గాంధీల కుటుంబం అప్పట్లో ఇలా!

By:  Tupaki Desk   |   4 Feb 2023 9:30 PM IST
పిక్‌ వైరల్‌.. గాంధీల కుటుంబం అప్పట్లో ఇలా!
X
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ మొదటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ వారసురాలిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.. ఇందిరా గాంధీ. కేవలం నెహ్రూ కుమార్తెగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన చరిత్రను సృష్టించుకున్నారు. మహిళ అబల కాదు సబల అని నిరూపించారు. ఉక్కు మహిళగా పేరు గడించారు. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌ పీచమణిచారు. నాటి ప్రతిపక్ష నేత అటల్‌ బిహారి వాజపేయి చేత అపర కాళిక అని కీర్తించబడ్డారు. 1984లో సొంత అంగరక్షకుల చేతిలోనే హత్యకు గురయ్యారు.

కాగా ఇందిరాగాంధీ కుటుంబానికి చెందిన పిక్‌ ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ చిత్రంలో ఇందిరాగాంధీతో పాటు ఆమె ఇద్దరు కుమారులు సంజయ్‌ గాంధీ, రాజీవ్‌ గాంధీ, ఇద్దరు కోడళ్లు.. మేనకా గాంధీ, సోనియా గాంధీ, మనుమడు, మనుమరాలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉన్నారు.

దేశ ప్రధానిగా, అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎంతో బిజీగా ఉన్నా ఆమె కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చేవారు. తన కుమారులు, కోడళ్లు, వారి సంతానంతో గడపటం ఆమెకు ఎంతో ఇష్టం. ఇందుకోసం తన షెడ్యూల్‌ ఎంత బిజీగా ఉన్నా వారితో తరచూ గడుపుతుండేవారు.

తాజాగా వైరల్‌ అవుతున్న చిత్రం చూస్తే ఇందిరాగాంధీ ముఖంలో ఆ సంతోషాన్ని చూడవచ్చు. ఈ చిత్రంలో ప్రస్తుతం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ చాలా చిన్న పిల్లలుగా ఉన్నారు. అలాగే అప్పటికి రాజీవ్‌ గాంధీ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి ఉండకపోవచ్చని అంటున్నారు.

తెలుపు రంగు దుస్తుల్లో రాజీవ్‌ గాంధీ, మేనకా గాంధీ ఈ చిత్రంలో నిలబడి ఉన్నారు. అలాగే ఇందిరాగాంధీ, ఆమె కోడలు సోనియా గాంధీ ఎరుపు రంగు చీర ధరించి కూర్చుని ఉన్నారు.

ఇక మేనకా గాంధీ కూడా తెల్లటి చీర ధరించినా దానిపైనా పూలు చిత్రించి ఉన్నాయి. రాజీవ్‌ గాంధీ, సంజయ్‌ గాంధీ మధ్య మేనక గాంధీ ఒక ఎత్తయిన పీఠ మీద కూర్చున్నట్టు ఉన్నారు.

ఇలా ఈ చిత్రంలో మూడు తరాలవారు ఇందిరాగాంధీ.. రెండో తరానికి చెందిన రాజీవ్‌ గాంధీ, సంజయ్‌ గాంధీ, మూడో తరానికి చెందిన రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. ఇందిరాగాంధీ తన కొడుకులు, కోడళ్లు, మనుమడు, మనుమరాలుతో కూర్చున్న సంతోషం ఆమె మోములో కనిపిస్తోంది. ఆమె చిత్రంలో నవ్వుతూ ఉన్నారు. ఇక తన నాయనమ్మ ముందు చిన్న అల్లిక కుర్చీలపై కూర్చున్న చిన్నారి రాహుల్‌ గాంధీ సైతం చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇక చిన్నారి ప్రియాంక మాత్రం గంభీరంగా ఫొటో కెమెరా వంకే చూస్తో కూర్చుంది. ఇప్పుడీ ఈ చిత్రం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.