Begin typing your search above and press return to search.

టీడీపీకి మ‌రో హెచ్చ‌రిక‌.. ఇది ఓట‌మిక‌న్నా తీవ్ర‌మే బాబూ!

By:  Tupaki Desk   |   16 March 2021 1:30 AM GMT
టీడీపీకి మ‌రో హెచ్చ‌రిక‌.. ఇది ఓట‌మిక‌న్నా తీవ్ర‌మే బాబూ!
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం.. టీడీపీకి ఇది మ‌రో శ‌రాఘాతం లాంటి ప‌రిణామం. తాజాగా పార్టీల గుర్తుల‌పై జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి భారీ ఓట‌మి ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో తుడిచి పెట్టుకుపోయింది. ఎక్క‌డా క‌నీసం గౌర‌వ ప్ర‌ద‌స్థానాన్ని కూడా టీడీపీ ద‌క్కించుకోలేదు. అయితే.. గెలుపు ఓట‌ములు ఎన్నిక‌ల్లో సాధార‌ణ‌మే అని స‌రిపెట్టుకున్నా.. తాజాగా ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి అందిన స‌మాచారం.. టీడీపీలో ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఇది ఓట‌మిని మించిన హెచ్చ‌రిక‌గా పార్టీ సీనియ‌ర్లు కూడా బావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అదే ఓట్ షేర్‌. తాజాగా జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీకి సంస్థాగ‌తంగా ఉన్న ఓటు బ్యాంకు భారీగా త‌గ్గిపోయింది. గ‌త 2019 స్వార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి 39 శాతం పైనే ఓట్లు పోల‌య్యాయి. అయితే.. కేవ‌లం రెండేళ్ల‌లోనే ఈ సంఖ్య 30 శాతానికి దిగ‌జారిపోయింది. ఇదేమీ ఆషామాషీ విష‌యం కాదు.. ఇప్పుడు పోతే పోనీ.. మ‌ళ్లీ సాధించుకుందాం.. అనుకునే తేలిక అంశం కూడా కాదు. ఒక్క‌సారి క‌నుక ఓట్ల షేరింగ్ దెబ్బ‌తింటే.. మ‌రో పార్టీవైపు ఓట్లు మ‌ళ్లితే.. తిరిగి ద‌క్కించుకోవ‌డం చాలా చాలా క‌ష్టం. గ‌తంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీ వైపు మ‌ళ్లింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ ఎక్క‌డా కాంగ్రెస్ దీనిని సాధించుకోలేక పోతోంది.

వాస్త‌వానికి గెలుపు ఓట‌ములు ప‌క్క‌న పెడితే.. ఓట్ల షేరింగ్ ఇంపార్టెంట్‌. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ఓట్ల‌ను సెంటిమెం టుగానే భావిస్తారు. ఒక‌పార్టీని న‌మ్మితే.. మంచైనా చెడైనా.. ఆపార్టీకే ఓట్లు వేసే సంప్ర‌దాయం ఉంది. అయితే.. ఇప్పుడు ఇలా కొన్ని ద‌శాబ్దాలుగా టీడీపీకి ఉన్న సంస్థాగ‌త ఓటు బ్యాంకు చేజారిపోతోంద‌నే ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓట్ షేర్‌ 52.63 శాతం కాగా, టీడీపీ 30.73 శాతం, బీజేపీ 2.41 శాతం, జనసేన 4.67 శాతం, సీపీఐ 0.80 శాతం, సీపీఎం 0.81 శాతం, కాంగ్రెస్‌ 0.62 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే టీడీపీ ఓట్‌ షేర్‌ భారీగా తగ్గిపోయింది. ఇది మంచి ప‌రిణామం కాద‌ని.. ఇప్పుడు క‌నుక మేల్కొన‌క‌పోతే.. మున్ముందు.. టీడీపీకి విజ‌యావ‌కాశాలు త‌గ్గిపోతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.