Begin typing your search above and press return to search.

ఆలయం లోపలే బ్రహ్మోత్సవాలా?

By:  Tupaki Desk   |   13 Oct 2020 8:50 AM GMT
ఆలయం లోపలే బ్రహ్మోత్సవాలా?
X
అంగరంగ వైభవంగా జరిగే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ఈసారి దేవాలయంలోపే నిర్వహించాలని దాదాపు డిసైడ్ అయిపోయింది. ఈమధ్యనే ముగిసిన బ్రహ్మోత్సవాలు కూడా యధావిధిగా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నీ వాహనాలను దేవాలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధులను బ్రహ్మాండమైన ఊరేగింపులతో భక్తుల సమక్షంలోనే నిర్వహించారు.

అయితే మళ్ళీ కరోనా సమస్య పెరుగుతున్న కారణంగా అధికమాసంలో మళ్ళీ ఈ నెలలో జరగాల్సిన బ్రహ్మోత్సవాలను మాత్రం దేవాలయం లోపలే నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మొన్నటి బ్రహ్మోత్సవాల గరుడోత్సవం రోజున జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో మంత్రులు, ఎంఎల్ఏల, ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు చాలామంది పాల్గొన్నారు. సిఎం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలామందికి కరోనా వైరస్ సోకిన విషయం బయటపడింది.

ఇపుడు కూడా మళ్ళీ అదే రిపీట్ కష్టమని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్ధాయి సమావేశం అభిప్రాయపడింది. ఇదే సమయంలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యులెవరు రాకపోయినా రోజువారి వచ్చే భక్తులే వేలల్లో ఉంటారు. వీళ్ళకు తోడు స్ధానికులు ఎటూ ఉండనే ఉంటారు. ఇలాంటి వేలల్లో ఓకేచోట చేరటం వల్ల మళ్ళీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉంది. అందుకనే త్వరలో జరగబోయే బ్రహ్మోత్సవాలను దేవాలయం లోపలే నిర్వహిస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని సమావేశంలో దాదాపు డిసైడ్ అయిపోయింది. కాకపోతే ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదంతే.