Begin typing your search above and press return to search.

ఇండియాలో త్వరలో టెస్లా కార్లు, స్టార్ లింక్ ఇంటర్‌ నెట్!

By:  Tupaki Desk   |   21 Jun 2023 1:00 PM GMT
ఇండియాలో త్వరలో టెస్లా కార్లు, స్టార్ లింక్ ఇంటర్‌ నెట్!
X
ప్రస్తుతం అమెరికా దేశ పర్యటనలో భాగంగా న్యూయార్క్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్ సీఈవో ఎలోన్ మస్క్‌ కలిశారు. ఈ సందర్భంగా తాను మోడీ అభిమానిని అని చెప్పుకున్న మస్క్... భవిష్యత్తులో భారతదేశంలో వారు పెట్టబోయే పెట్టుబడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఇంటర్ నెట్ అంశాన్ని కూడా ప్రస్థావించారు.

అవును... అమెరికా పర్యటనలో ఉన్న మోడీని కలిసిన ఎలోన్ మస్క్... భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా... భారతదేశంలో కార్ల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పే ప్రణాళికల గురించి మస్క్.. ప్రధాని మోడీకి వివరించారు. వీలైనంత త్వరగా భారతదేశంలో తాను పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లు మస్క్ తెలిపారు.

అయితే... టెస్లా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ లు ఇటీవల ఇండియా వచ్చారు. ఇందులో భాగంగా... భారతదేశంలో కార్లు, బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై గత నెలలో ఇక్కడి అధికారులు, మంత్రులతో చర్చలు జరిపారు. అనంతరం టెస్లా కార్ల కంపెనీకి భారతదేశంలో అనువైన పరిస్థితులు ఉన్నాయని.. కార్ల అమ్మకాలు కూడా రికార్డ్ స్థాయిలో ఉండే అవకాశం ఉందని సూచించినట్లు తెలిసింది.

ఇదే సమయంలో వచ్చే ఏడాది తాను భారతదేశాన్ని సందర్శించాలనుకుంటున్నట్లు పేర్కొన ఎలోన్ మస్క్... స్టార్‌ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను భారత్‌ కు కూడా తీసుకురావాలని భావిస్తున్నట్లు స్పేస్‌ ఎక్స్ సీఈఓ గా కూడా ఉన్న మస్క్ వివరించారు.

ఇంటర్నెట్ యాక్సెస్ లేని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇది సహాయపడుతుందని మస్క్ చెప్పారు. ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఒక ప్రదేశాన్ని టెస్లా ఎంచుకోనుందని ప్రకటించారు. ఫలితంగా... తనకు భారతదేశంతో మరింత విడదీయరాని బంధం ఉంటుందని చెప్పుకొచ్చారు.

మోడీ తో భేటీ అనంతరం మస్క్ ట్విట్టర్ లో స్పందించారు. ఈ సందర్భంగా మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. "భారతదేశ భవిష్యత్తు గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ప్రధానమంత్రి మోడీ భారతదేశం గురించి నిజంగా శ్రద్ధ వహిస్తారు.. గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి మమ్మల్ని ముందుకు తీసుకువెళతారు. నేను మోడీ అభిమానిని. ఇది అద్భుతమైన సమావేశం" అని ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు!