Begin typing your search above and press return to search.

బిడ్డల తారుమారు.. ఆగమైన తల్లులు

By:  Tupaki Desk   |   17 Nov 2019 10:37 AM GMT
బిడ్డల తారుమారు.. ఆగమైన తల్లులు
X
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని ఓ కవి పాడాడు. పాట వరకు మాత్రం బాగానే ఉంది. కానీ నిజంగా కుడి ఎడమయ్యారు ఆ బిడ్డలు.. తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి జిల్లా భెల్ బాయిలర్ కర్మాగార అనుబంధ ఆస్పత్రిలో బిడ్డలు తారుమారైన ఘటన వివాదానికి దారితీసింది.

భెల్ లో పనిచేసే ఉద్యోగులకు అనుబంధంగా ఆస్పత్రి ఉంది. అక్కడ ఉద్యోగుల కుటుంబాలకు చికిత్స చేస్తారు. ఆ కోవలోనే భెల్ ఉద్యోగి వినోద్ భార్య, మరో ఉద్యోగి బాలకుమార్ భార్యలు ఈ నెల 11న, 12న వరుసగా మగబిడ్డలకు జన్మనిచ్చారు. ఇద్దరి బిడ్డలను స్నానానికి తీసుకెళ్లిన నర్సులు తిరిగి తీసుకొచ్చి పడుకోబెట్టారు. అయితే ఓ తల్లి బిడ్డకు పాలు పట్టగా తాగలేదు. దీంతో తన బిడ్డ స్నానం చేయించేటప్పుడు తారుమైందని ఆ తల్లి ఆందోళన చేసింది. మరో తల్లి మాత్రం తన బిడ్డ ఈ బిడ్డేనంటూ ఇవ్వలేదు.

దీంతో ఇద్దరు పసిబిడ్డలకు బ్లడ్ టెస్ట్ చేశారు వైద్యులు.. ఇద్దరివీ ఓ పాజిటివ్ వచ్చింది. ఇక బరువు తూచారు. ఇద్దరూ 2.95 కిలోలే ఉన్నారు. దీంతో ఎవరి బిడ్డ ఎవరో తేల్చడానికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. తల్లీ బిడ్డల రక్తనమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు.

ఇలా ఆస్పత్రి నిర్వాహకులు చేసిన తప్పుకు పాపం ఆ తల్లులు ఆగమయ్యారు. తమ బిడ్డో కాదో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.