Begin typing your search above and press return to search.

మిస్టర్ కూల్..ఇలా హాట్ అయ్యారేంటీ..అంపైర్ పై మహీ ఫైర్

By:  Tupaki Desk   |   14 Oct 2020 10:51 AM
మిస్టర్ కూల్..ఇలా హాట్ అయ్యారేంటీ..అంపైర్ పై మహీ ఫైర్
X
మహేంద్ర సింగ్ ధోనీ అంటేనే మిస్టర్ కూల్ అని..వివాద రహితుడని పేరు. జట్టు విజయాల్లో ఉన్నా , అపజయాల్లో ఉన్నా కూల్ గా ఉండి పని ముగించడం ధోని కి మొదటి నుంచి అలవాటు. అందుకే కెరీర్ ఆరంభంలో సచిన్, ద్రావిడ్, సెహ్వాగ్ వంటి బ్యాటింగ్ దిగ్గజాలు జట్టులో ఉన్న అందర్నీ కలుపుకొని వెళ్లేవాడు. పత్రిలో సాధ్యమైనంతవరకు భావోద్వేగాలు కనిపించేవి కావు. విసుగు, అసహనం, కోపం ప్రదర్శించేవాడు కాదు. ఆటగాళ్లకు తగినంత స్వేచ్ఛ ఇచ్చేవాడు. పరిస్థితులు ఏవైనా ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడంలో మహీ స్పెషల్. టీమిండియాకు అతడు వరల్డ్ కప్, టీ 20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ అందించాడు.

ఏ పరిస్థితులకు లొంగని ధోనీని అభిమానులు ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకునేవారు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది తను కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా పలు మ్యాచ్ లలో ఓడింది. ధోని ఆడ తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఆటే కాదు అతని ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని అభిమానులు అంటున్నారు. ఎప్పుడూ కూల్ గా ఆలోచించే ధోనీ చీటికీ మాటికీ అంపైర్ల తో పేచీ పెట్టుకుంటున్నాడు. ఇది చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు. ధోనీ ఏంటి.. ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని.. వాపోతున్నారు. తన స్థాయికి ఇది తగదని అంటున్నారు. ఐపీఎల్ లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడింది. ఈ మ్యాచ్లో చెన్నై రైజర్స్ జట్టుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

కాగా ఈ మ్యాచ్లో ధోనీ ప్రవర్తనపై విమర్శలు చెలరేగుతున్నాయి. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించమే కాకుండా అంపైర్ ఏకంగా తాను తీసుకోబోయే నిర్ణయాన్ని కూడా ధోని ప్రవర్తనతో మార్చుకున్నాడు. చెన్నై బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బౌలింగ్ కు వచ్చాడు. అప్పటికి సన్‌రైజర్స్ 11 బంతుల్లో 24రన్స్ చేయాల్సి ఉంది. రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఠాకూర్ ఓవర్లో రెండో బాల్ వైడ్ గా వేసాడు.మళ్లీ అతడు విసిరిన మూడో బాల్ కూడా క్రిజ్ లో ఉన్న రషీద్ కు అందలేదు. దానిని కూడా అంపైర్ రైఫిల్ వైడ్ గా ప్రకటించేందుకు చేతులు చాప బోతుండగా ధోని ఆగ్రహంతో అది వైడ్ కాదంటూ సంజ్ఞలు చేశాడు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆ బాల్ ను వైడ్ గా ప్రకటించలేదు. ధోని తన సైగలతోనే అంపైర్ ని బెదిరించి నిర్ణయం మార్చుకునేలా చేశాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్లో ఇప్పుడు కనిపించని విధంగా మహీ కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.