Begin typing your search above and press return to search.

మోడీ అమ్మితే జగన్ని కొనమంటున్న ఉండవల్లి

By:  Tupaki Desk   |   20 Nov 2022 3:32 PM GMT
మోడీ అమ్మితే జగన్ని కొనమంటున్న ఉండవల్లి
X
ఏపీకి అత్యంత కీలకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. ఇది ఏపీకి గర్వకారణం కూడా. ఒక భారీ జన ఉద్యమం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో చెప్పేలా విశాఖ ఉక్కు కర్మాగారం సాగర తీరాన వెలిసింది. 32 మంది త్యాగాల మీద నిలిచిన ఉపాధి కేంద్రంగా స్టీల్ ప్లాంట్ ని చూస్తారు. విశాఖకు కేరాఫ్ అంటే స్టీల్ ప్లాంట్ నే చెప్పాలి.

అలాంటి స్టీల్ ప్లాంట్ ని యాభై ఏళ్ళ క్రితం విశాఖ బీచ్ కెరటాల సాక్షిగా పోటెత్తిన ప్రజా ఉద్యమానికి తలవంచి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ హామీ ఇచ్చి మరీ ఏర్పాటు చేశారు. విశాఖ ఉక్కు శంకుస్థాపన, దాని నిర్మాణం ఉత్పత్తి అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల ఏలుబడిలోనే సాగడం విశేషం.

ఇపుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ స్టీల్ ప్లాంట్ ని అమ్ముతామని తెగేసి చెబుతోంది. పైగా దాని చరిత్రను త్యాగాలను కూడా పక్కన పెట్టేస్తోంది. దాంతో గత ఆరు వందల రోజులుగా విశాఖ కార్మికులు ఒక్కటిగా నిలిచి ఉద్యమిస్తున్నారు. అయితే దీన్ని కేంద్రం లైట్ గా తీసుకుంటోంది.

ఈ మధ్యనే విశాఖ వచ్చి తాను చెప్పదలచుకున్నది చెప్పేసి ప్రధాని మోడీ ఎంచక్కా వెళ్ళిపోయారు. ఆయన చేత విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ఒక మంచి మాట సీఎం జగన్ చెప్పించలేకపోయారు అన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో తాజాగా విశాఖ ఉక్కుని రక్షించుకుందామంటూ సాగిన మహా సదస్సుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన విశాఖ ఉక్కుని అమ్మడం కంటే దారుణం వేరొకటి ఉండదు అని మండిపడ్డారు.

ప్రభుత్వ రంగ సంస్థలను వరసగా అమ్ముతూ పోతే ఈ దేశంలో మిగిలేది ఏంటి అని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు అమ్మకం అంటే వెనక ఉన్న ఉద్యమ చరిత్రను కించపరచడమే అని ఆయన అన్నారు. విశాఖ ఉక్కుని కేంద్రం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మోడీ రైతుల ఉద్యమానికి తలొగ్గి సాగు చట్టాలను రద్దు చేసుకున్నారని, అలాగే విశాఖ ఉక్కు విషయంలో కూడా ఆయన నిర్ణయం వెనక్కి మళ్ళేలా మహోద్యమం నిర్మించాలని ఆయన పిలుపు ఇచ్చ్చారు.

విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ అమ్ముతామంటే ప్రజా ప్రయోజనాల రిత్యా కొనడానికి ఏపీలోని జగన్ సర్కార్ ఎందుకు ముందుకు రావడంలేదని ఆయన ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలలో అయితే ఇలాంటి ప్లాంట్ లను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వాలే మొదట ఉంటాయని ఆయన గుర్తు చేశారు. జగన్ సర్కార్ ఈ విషయంలో ఎందుకు ముందుకు అడుగు వేయడంలేదో తనకు అర్ధం కావడం లేదని ఉండవల్లి అన్నారు. మొత్తానికి మోడీతో పాటుగా జగన్ని కూడా కలిపి హాట్ హాట్ కామెంట్స్ చేసి పారేశారు మాజీ ఎంపీ. అయినా జగన్ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ని కొని తామే నడిపితే తప్పేంటి అన్న ప్రశ్నకు జవాబు చెబుతారా..