Begin typing your search above and press return to search.

రామోజీ ఆస్తుల‌కు జ‌నం సొమ్మే పెట్టుబ‌డా?! : ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల వెనుక‌!!

By:  Tupaki Desk   |   15 March 2023 12:06 PM GMT
రామోజీ ఆస్తుల‌కు జ‌నం సొమ్మే పెట్టుబ‌డా?! : ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల వెనుక‌!!
X
ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధినేత‌, మీడియా మొఘ‌ల్ రామోజీరావు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న ఒక్క‌డి ఆలోచ‌ల‌తో ఏర్ప‌డ్డ సంస్థ‌లు.. శాఖోప‌శాఖ‌లుగా విస్త‌రించి.. కొన్ని ల‌క్ష‌ల మందికి ఉపాధి, ఉద్యోగాలు క‌ల్పిస్తున్నాయి. ఈనాడు, ప్రియా ఫుడ్స్‌, ఫిలింసిటీ, మార్గ‌ద‌ర్శి చిట్స్, హ‌స్త‌క‌ళ‌లు, వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌ ఇలా.. అనేక వ్యాపారాలను ఆయ‌న న‌డిపిస్తున్నారు అయితే.. ఏ వ్యాపారంలో అయినా.. ఏ కార్య‌క్ర‌మానికైనా.. డ‌బ్బుతోనే ప‌ని. పెట్టుబ‌డి అవ‌స‌రం.

ఇక్క‌డే అనేక ఆరోప‌ణ‌లు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. రామోజీ గ్రూపున‌కు చెందిన మార్గ‌ద‌ర్శి చిట్ ఫండ్ కంపె నీల్లో ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై(ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌లేదు) ఏపీ సీఐడీ అధికా రులు.. ఈ సంస్థ‌ల్లో త‌నిఖీలు చేయ‌డం.. ఇటీవ‌ల కాలంలో ఏకంగా రామోజీ, ఆయ‌న కోడ‌లు, మార్గ‌ద‌ర్శి ఎంపీ శైల‌జా కిర‌ణ్‌పై కేసులు న‌మోదు చేయ‌డం.. వంటివి సంచ‌ల‌నంగా మారాయి. ఇక‌, ఈ సంస్థ‌ల‌కు చెందిన ఫోర్‌మెన్‌ల‌ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఒక‌రికి మాత్ర‌మే బెయిల్ వ‌చ్చింది.

ఇదిలావుంటే.. మార్గ‌ద‌ర్శి చిట్స్‌లో ఏదో ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని.. గ‌త 17 సంవ‌త్సరాలు గా.. రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న కోర్టుకు కూడా వెళ్లారు. ప్ర‌స్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో విచార‌ణ‌కు కూడా వెళ్లింది. ఇక‌, ఇప్పుడు ఏపీ సీఐడీ కేసులు న‌మోదు చేసిన నేప‌థ్యంలో మ‌రోసారి ఉండ‌వ‌ల్లి.. మార్గ‌ద‌ర్శిలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యాలు వెల్ల‌డించారు.

రామోజీ రావు వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం- మార్గదర్శిలో డిపాజిటర్లు, సబ్ స్రైబర్లు దాచుకునే డబ్బేనని ఉండవల్లి తేల్చి చెప్పారు. ఈ డబ్బులన్నింటినీ దారి మళ్లిస్తోన్నారనడంలో సందేహాలు అక్కర్లేదని వివరించారు. మార్గదర్శి యాజమాన్యంపై తాను కంప్లైంట్ ఇవ్వాలని ముందుకు వస్తే- ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి ఉందని, న్యాయవాదులు సైతం ఈ విషయాన్ని అంగీకరించార ని అన్నారు.

మార్గ‌ద‌ర్శి ఏం చేస్తోంది?

``మార్గ‌ద‌ర్శి చిట్ ఫండ్‌లో ఎవ‌రైనా చీటీ వేసి పాడుకుంటే.. వారికి పాడుకున్న సొమ్మును ఇచ్చేందుకు అనేక నిబంధ‌న‌లు పెడ‌తారు. ఈ నిబంధ‌న‌లు పాటించ‌డం అత్యంత క‌ష్టం. వాటిని పాటించ‌క‌పోతే.. ఆ సొమ్మును త‌మ‌ద‌గ్గ‌రే పెట్టుకుని.. బ్యాంకుక‌న్నా.. రూపాయి త‌క్కువ వ‌డ్డీ ఇస్తారు. కానీ, ఆ సొమ్మును మాత్రం రామోజీ గ్రూపులో పెట్టుబ‌డులు పెడ‌తారు. చిట్ ఫండ్స్ చ‌ట్టం.. ప్ర‌కారం.. ఇది నేరం`` అని ఇటీవ‌ల సీఐడీ అధికారులు వెల్ల‌డించారు. మొత్తంగా చూస్తే.. రామోజీపై ఎలాంటి ఫిర్యాదులు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.