Begin typing your search above and press return to search.

ఆమె ఆఫ్ఘాన్ ను జయించింది.. ఉక్కుమహిళ ఉద్యమానికి సలాం!

By:  Tupaki Desk   |   23 Sep 2020 2:30 AM GMT
ఆమె ఆఫ్ఘాన్ ను జయించింది.. ఉక్కుమహిళ ఉద్యమానికి సలాం!
X
ఒక్క మహిళ ఓ ప్రభుత్వాన్ని ఎదురించింది. అక్కడ తాను ఎదుర్కొన్న వివక్ష ఇకపై ఓ మహిళ ఎదుర్కోవద్దని ఉక్కు సంకల్పంతో పోరాడింది. ఆమె పోరాటానికి ఆది నంచి సవాళ్లే ఎదురయ్యాయి. ఆదరించే వారే కరువయ్యారు. అయినా సడలని సంకల్పంతో అనుకున్నది సాధించింది. చివరకు ఆఫ్ఘాన్ ప్రభుత్వమే దిగివచ్చింది. అక్కడ చట్టాన్నే మార్చేసింది. ఆ ఉక్కుమహిళే పేరు లాలె ఉస్మాని.. ఆమె మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘వేర్​ ఈజ్​ మైనేమ్​’ ఉద్యమం యావత్​ ప్రపంచాన్నే కదిలించి వేసింది. సెప్టెంబర్‌ – 17న ఆప్ఘనిస్థాన్​ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని అక్కడి ‘జనాభా నమోదు చట్టాన్ని’ సవరిస్తూ ఒక చరిత్రాత్మక సంతకం చేశారు. ఇక ఆప్ఘనిస్థాన్​ మహిళలు ప్రస్తుతం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. తమ ఉనికిని చూసి గర్వపడుతున్నారు.

లాలె ఉస్మాని పోరాట నేపథ్యం ఏమిటి?

ఆప్ఘనిస్తాన్‌ దేశంలోని చట్టాలు స్త్రీల విషయంలో చాలా దారుణంగా ఉన్నాయి. ఓ మహిళ తన పేరును బయట చెప్పుకోవడానికే అక్కడి చట్టాలు ఒప్పుకోవు. ఆసుపత్రి రికార్డుల్లో, బడుల్లో, జనాభా లెక్కల్లో ఆ దేశంలో మహిళలే పేర్లు ఉండకూడదు. ఓ స్త్రీ ఫలనావాడి కూతురుగానో, పెళ్లైతే ఫలానా వాడి భార్యగా, మొగుడి చనిపోతే ఫలానా వాడి తల్లిగా బతకాల్సిందే తప్ప ఆమె పేరును బయట వెల్లడించడానికి వీల్లేదు. దీంతో ఆ దేశ మహిళలు ఇన్నేళ్లుగా నరకం అనుభవించారు. అక్కడి కట్టుబాట్లకు భయపడి ఎవరూ బయటకు చెప్పుకోలేదు. కానీ లాలే ఉస్మాని మాత్రం ఈ కట్టుబాట్లను ఎదురించింది. మూడేండ్ల క్రితం ‘వేర్​ ఈజ్​ మై నేమ్​’ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి ప్రస్తుతం ఆ దేశం స్పందించాల్సి వచ్చింది. 2001కి ముందు ఆప్ఘనిస్తాన్‌ ను తాలిబన్‌ లు పాలించేవారు. వాళ్ల పాలన లో స్త్రీల పరిస్థితి దారుణంగా ఉండేది. తాలిబన్ల పతనం అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు కూడా స్త్రీలు కోసం చేసింది ఏమీ లేదు.

ఎవరీ లాలే ఉస్మాని

ఆఫ్ఘనిస్తాన్‌ లోని హెరత్‌ కు చెందిన లాలె ఉస్మాని అభ్యుదయ భావాలు గల మహిళ. తన దేశంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్షను ఎలాగైనా ఎదుర్కొవాలనుకున్నది. అందు కే ‘వేర్‌ ఈజ్‌ మై నేమ్‌’ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి ఆప్ఘనిస్తాన్‌లోని కమ్యూనిస్టులు తొలుత మద్దతు తెలిపారు. తర్వాత ఈ సమస్య అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశమైంది. ప్రపంచంలోని మానవహక్కుల నేతలు ఈ సమస్యపై స్పందించారు. లాలేకు మద్దుతు తెలిపారు. అయితే ఈ ఉద్యమానికి స్వంత దేశంలోని మహిళల నుంచే వ్యతిరేకత వచ్చింది. ‘నీ పిల్లల గుర్తింపు కార్డులో నీ పేరు ఎందుకు కావాలో మాకు తెలుసులే. ఆ పిల్లల తండ్రి ఎవరో నీకు తెలియదు కదా’ అని కొందరు దారుణంగా కామెంట్‌ చేశారు.

అయినా లాలే వెరవలేదు. అయినా తన ఉద్యమాన్ని కొనసాగించింది.
స్త్రీల పేర్లు గుర్తింపు కార్డుల్లో వచ్చేలా ‘జనాభా నమోదు చట్టం’ను సవరణ చేయాలనే ప్రతిపాదనలు వచ్చినప్పుడు పార్లమెంటులో కొందరు సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు దేశాధ్యక్షుడైన అష్రాఫ్‌ ఘని స్త్రీల సంకల్పానికి తల వొగ్గారు. వ్యతిరేకతలు లెక్క చేయకుండా స్త్రీల పేర్లకు సంబంధించిన నిషేధాన్ని ఎత్తేశారు. ఇది ఒక పెద్ద, ఘనమైన విజయం. అయితే అధ్యక్షుడి నిర్ణయాన్ని తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం పటిష్ఠంగా అమల్లోకి రావాలని ప్రపంచంలోని మానవతా వాదులందరూ ముక్తకంఠతో కోరుకుంటున్నారు.