Begin typing your search above and press return to search.

కొలిక్కి వచ్చిన శిరీష మృతి కేసు... ఇంత దారుణమా..?

By:  Tupaki Desk   |   14 Jun 2023 3:02 PM
కొలిక్కి వచ్చిన శిరీష మృతి కేసు... ఇంత దారుణమా..?
X
నర్సింగ్‌ విద్యార్థిని శిరీష అనుమానాస్పద కేసు ను పోలీసులు చేధించారు. శిరీష ను హత్య చేసింది ఆమె బావ అనిల్‌, అతని స్నేహితుడు రాజు గా పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో శిరీష బావ, అతని ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు.

అవును... రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొదటి నుండి ఆమె బావ చుట్టే కేసు తిరుగుతున్నప్పటికీ గత మూడు రోజులు గా అనిల్‌ పోలీసుల ఎదుట నోరు మెదపలేదు. చివరికి అనిల్ కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. అతని స్నేహితుడి ని సైతం అదుపు లోకి తీసుకొని విచారించారు. దీంతో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

చెప్పిన మాట వినడం లేదని.. ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటుందని శిరీష తో బావ అనిల్ వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంలో మొబైల్ ఎక్కువగా వాడుతున్నావంటూ మరదలు శిరీష ను అనిల్ మందలించాడు. శిరీష కూడా తిరిగి అనిల్ తో వాగ్వాదానికి దిగింది. దీంతో శిరీష పై అనిల్ చేయిచేసుకున్నాడు. అనంతరం అతడు పరిగి వెళ్లిపోయాడు. ఫలితంగా మనస్తాపానికి గురైన శిరీష రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.

దీంతో శిరీష ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఆమె సోదరుడు శ్రీను.. అనిల్‌ కు ఫోన్‌ చేసి చెప్పాడు. అప్పటికే తన మిత్రుడి తో కలిసి ఫుల్‌ గా మద్యం సేవించిన అనిల్.. మరో బీరు తీసుకొని ఫ్రెండ్‌ తో కలిసి కాడ్లాపూర్ బయలుదేరాడు. ఊరు శివారు లో ఉన్న మైసమ్మ గుడి దగ్గర శిరీష కనిపించడంతో ఆగ్రహం తో ఎందుకు బయట కు వచ్చావని ప్రశ్నించాడు. శిరీష కూడా ధీటు గా సమాధానం ఇవ్వడంతో అనిల్.. శిరీష ను కొట్టాడు.

అనంతరం అతని ఫ్రెండ్‌ రాజు, శిరీష ను అక్కడే ఉన్న కుంట వైపు లాకెళ్ళి వెంటతెచ్చుకున్న బీరు బాటిల్‌ తో తల పగల గొట్టి, ఆమె కళ్ళల్లో గుచ్చినట్లు సమాచారం! ఈ సందర్భంగా తన ను వదిలేయండి అంటూ శిరీష ఎంత ప్రదేయపడ్డా వదల్లేదని, మోకాలు లోతు నీళ్ళున్న కుంట లో ఆమెను ఇద్దరు కలిసి విసిరేసినట్లు తెలిసింది. ఆ నీటి లో ఊపిరాడకుండా శిరీష చనిపోయే వరకు ఆమె దేహం పై అనిల్ ఫ్రెండ్ నిలుచున్నట్లు తెలుస్తోంది.

చాలా సేపటి తర్వాత ఆమె చనిపోయిందని నిర్దారించుకొని అక్కడ ఆనవాళ్ళను మాయం చేసిన ఈ దోస్తులిద్దరూ... ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చేసిందంతా చేసి మళ్ళీ శిరీష కోసం వెతికినట్లు నాటకం ఆడారు. కాగా ఇద్దరు నిందితులు ఇంకా పోలీసుల కస్టడీ లోనే ఉన్నారు. మరి కొన్ని గంటల్లో పోలీసులు దీనికి సంబంధించి అధికారికంగా పూర్తి సమాచారాన్ని వెల్లడించనున్నారు.