Begin typing your search above and press return to search.

హరీశ్ రావు మంచోడు కాదంటున్న వీహెచ్

By:  Tupaki Desk   |   19 Jun 2016 7:02 AM GMT
హరీశ్ రావు మంచోడు కాదంటున్న వీహెచ్
X
తెలంగాణ మంత్రి హరీశ్ రావును విమర్శించడానికి తెలంగాణ నేతలు కాస్త వెనుకాడుతారు. అయితే.. తెలంగాణలో కూడా ఎవరినైనా సరే నిర్మొహమాటంగా విమర్శించే కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వంటివారు కొందరు ఇందుకు మినహాయింపు. తాజాగా ఆయన హరీశ్ పై నిప్పులు చెరిగారు. ఏదో మామూలు విమర్శలు కాదు.. హరీశ్ రావు మంచోడు కాదని.. కుట్రలు చేసే మనిషంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రజలను రెచ్చగొట్టి రైతులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు విమర్శించారు. ఆయన మంచివాడని తాను భావించానని, కానీ ఆయన కుట్ర పూరిత వ్యాఖ్యలతో మంచివాడిని కాదని నిరూపించుకున్నారని అన్నారు. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను హరీశ్ కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తాను 400 గ్రామాల ప్రజలను రెచ్చగొడతానని అనడం - మంత్రిగా ఆయన స్థాయికి తగ్గ వ్యాఖ్యలు కాదని వీహెచ్ హితవు పలికారు. కాంట్రాక్టులు - మంత్రి పదవులను ఆశగా చూపుతూ, విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీయేనని.. ఆ సంగతి మర్చిపోయి కేసీఆర్ కాంగ్రెస్ నే మోసగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాను మోసం చేస్తూ కాంగ్రెస్ నేతలను టీఆరెస్ లోకి ఆకర్షిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పార్టీ మారడంపైనా వీహెచ్ మండిపడ్డారు. వామపక్షాల భావజాలాన్ని మట్టిలో పాతరేసి కేసీఆర్ పంచన చేరారని రవీంద్రకుమార్ వంటివారు కమ్యూనిస్టు పార్టీల్లో లేకపోవడమే మంచిదన్నారు.