Begin typing your search above and press return to search.

మనకీ వయసులో ఇవన్నీ అవసరమా బాబాయ్?

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:34 AM GMT
మనకీ వయసులో ఇవన్నీ అవసరమా బాబాయ్?
X
కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా సిత్రంగా వ్యవహరిస్తుంటారు. వరుస పెట్టి ఓటములు వస్తూ.. ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారటమే కాదు.. రానున్న రోజుల్లో అయినా ఆ పార్టీ దిశ.. దశ తిరుగుతుందా? అన్న ప్రశ్నకు ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి. దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ప్రజల స్వప్నాన్ని తీరుసతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటులో కీలకమైనప్పటికీ దానికి మైలేజీని సొంతం చేసుకోవటంతో చతికిల పడిన కాంగ్రెస్.. ఇప్పుడు మరింతగా నీరసించిందని చెప్పక తప్పదు.

కేసీఆర్ లాంటి తెలివైన.. జనాకర్షక నేత ముందు తేలిపోతున్న కాంగ్రెస్ నేతలకు అనైక్యత అనే జబ్బు ముదిరిపోయి.. వారి ఉనికి సైతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రజల్లో పలుకుబడి.. ఛరిష్మా ఉన్న నేతకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలన్న సింఫుల్ విషయాన్ని కూడా ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేయటం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేతనైనంత బాగా మరెవరికీ చేతకాదేమో?

ఎవరిదాకానో ఎందుకు? సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సంగతే తీసుకోండి. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా గెలవని ట్రాక్ రికార్డు ఆయన సొంతం. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు? మాస్ లుక్ ఉన్నప్పటికీ.. ఆ మాస్ ప్రజల అండదండలు ఆయనకు తక్కువే. ఇవన్నీ కాదు.. ధనబలం ఉందా? అంటే అది లేదు. పార్టీలో ఆయన నాయకత్వానికి అండగా నిలిచే జట్టు ఉందా? అంటే అదీ లేదు. ఇలా ఏమడిగినా లేదనే సమాధానం వచ్చే వీహెచ్ లాంటోళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలుకోరుకుంటే.. పార్టీ సంగతి ఏమవ్వాలి?

వయసు మీద పడిన వేళ.. ఇప్పటి రాజకీయాలకు సూట్ అయ్యేవాడిని... దేనికైనా సై అంటూ దౌడు తీసే రేసుగుర్రానికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టి.. పార్టీని ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పాల్సిన వీహెచ్.. తనకు తానే పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు చెప్పుకోవటాన్ని ఎలా చూడాలి?ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి ఎంత నష్టం జరగాలో అంత డ్యామేజ్ జరిగిపోయింది. ఇంత జరిగిన తర్వాత కూడా పీసీపీ చీఫ్ పదవి కోసం వీహెచ్ పడే ఆరాటం చూస్తే.. సమీప భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు రావనే చెప్పాలి. అయినా.. ఈ వయసులో మనకీ రేసులు అవసరమా వీహెచ్ బాబాయ్?