Begin typing your search above and press return to search.

తాత గారు పార్టీ మారతారట..ఏ పార్టీ ఆహ్వానిస్తుందో?

By:  Tupaki Desk   |   8 Aug 2019 4:43 PM GMT
తాత గారు పార్టీ మారతారట..ఏ పార్టీ ఆహ్వానిస్తుందో?
X
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో ప్రత్యేకించి ఆ పార్టీ తెలంగాణ శాఖలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న వి. హన్మంతరావు నిజంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న వీహెచ్... ఏ ఇతర పార్టీకి సంబంధం లేని నేతేనని చెప్పాలి. వీహెచ్ అంటే కాంగ్రెస్ పార్టీ నేతగానే మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దగా రాణించని వీహెచ్... ఇప్పుడు వయసు మీద పడిన నేతగా - నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్నారు. స్వపక్షం - వైరివర్గం అన్న తేడా లేకుండా ఏ నేతనైనా టార్గెట్ చేయగలిగిన నేతగా వీహెచ్ సుప్రసిద్ధుడే. వయసు ఉడిగిన ప్రస్తుత తరుణంలో కదలడానికి కూడా నానా తంటాలు పడుతున్న వీహెచ్... తన జీవిత చరమాంకంలో పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్న వైనం నిజంగానే ఆసక్తికరమే.

అప్పుడెప్పుడో 1970 దశకంలో ఓ సారి - 1980 దశకంలో మరోమారు అంబర్ పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వీహెచ్... ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలను వదిలేశారనే చెప్పాలి. ఆ తర్వాత పార్టీ అధిష్ఠానం అండతో రాజ్యసభ సభ్యత్వం ఇప్పించుకున్న వీహెచ్... మొన్నటి ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ సీటును అడిగారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ అసలు వీహెచ్ అభ్యర్థననే పట్టించుకోలేదు. దీనిపై గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న వీహెచ్ గురువారం నాడు సంచలన ప్రకటన చేశారు.

త్వరలోనే తాను పార్టీ మారనున్నట్లుగా ప్రకటించిన వీహెచ్... తన అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరతానన్న దానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయినా ఆది నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీనే వీహెచ్ ను పట్టించుకోవడం లేదన్న మాట బాగానే వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో వీహెచ్ వస్తానన్నా... ఏ పార్టీ ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తుందోనన్న వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడంతా యంగ్ తరంగ్ కదా... వీహెచ్ లాంటి తాతగారిని ఆహ్వానించేందుకు ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అయినా వయసు ఉడిగిన ప్రస్తుత తరుణంలో పార్టీ మారతానంటూ వీహెచ్ చేసిన ప్రకటనపై సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి.