Begin typing your search above and press return to search.

వైసీపీలో వంశీగానమేనా..?

By:  Tupaki Desk   |   1 Nov 2021 12:30 AM GMT
వైసీపీలో వంశీగానమేనా..?
X
ఆయన పార్టీకి బద్ధుడు. చిత్తశుద్ధిలో సాటీ పోటీ లేనివాడు. వైసీపీలో ఆది నుంచి ఉన్నవాడు. ఇంకా చెప్పాలంటే జగన్ పార్టీ పెట్టాక తొట్టతొలిగా విశాఖ నుంచి వచ్చి చేరిన వాడు. ఆయనే యువ నాయకుడు, విశాఖ వైసీపీ సిటీ ప్రెసిడెంట్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్. ఆయన కు జగన్ ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. బ్యాడ్ లక్ 2014లో జరిగిన ఎన్నికలలో విశాఖ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాటి నుంచి కష్టపడుతూ పోయిన చోటనే వెతుక్కోవాలనుకున్నారు. కానీ ఈసారి అంటే 2019లో ఆయనకు టికెట్ దక్కలేదు. పార్టీ అధికారంలోకి వస్తే మేయర్ సీటు ఇస్తామని అన్నారు. తీరా ఆ ముచ్చటా తీరలేదు. మహిళా కోటాలో దాన్ని వేరే వారు ఎగరేసుకుపోఅరు.

ఆ టైమ్ లో ఇచ్చిన హామీ ఎమ్మెల్సీ సీటు. ఇపుడు ఆ టైమ్ వచ్చేసింది. ఎమ్మెల్యే కోటాలో మూడు సీట్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పెద్దల సభలో ఆరేళ్ల పాటు హాయిగా అధికారాన్ని అనుభవించే ఎమ్మెల్సీ కుర్చీ కోసం వైసీపీలో అతి పెద్ద పోరు ఉంది. అయితే జగన్ స్వయంగా తనకు హామీ ఇచ్చారు కాబట్టి ఈసారి ఎమ్మెల్సీ అవడం ఖాయమని వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ధీమాగా ఉన్నారు. ఆయనకు అన్నీ అర్హతలూ ఉన్నా ఎక్కడో బ్యాడ్ లక్ మొదటి నుంచి వెనక్కు లాగుతోంది. ఈసారి కూడా సీటు చేతిలో పడేవరకూ కొంత జాగ్రత్తగా ఉండాలని ఆయన అనుచరులు అంటున్నారు.

ఎందుకంటే గతసారి ఎమ్మెల్సీ సీటుని జగన్ కడప జిల్లాకు చెందిన రమేష్ యాదవ్ కి ఇచ్చారు. వంశీ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇపుడు అదే అడ్డుగా మారుతుందా అన్న బెంగ అయితే ఆయన అభిమానులలో ఉంది. అయితే జగన్ తలచుకుంటే ఇలాంటివి అడ్డు రావు, పైగా ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన బీసీ నేతగా ఉన్న వంశీకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అంటే పార్టీకి ప్లస్ అవుతుందని కూడా వాదించేవారు ఉన్నారు. మొత్తానికి రాజకీయాల్లోనూ, వైసీపీలోనూ వంశీ తరువాత వచ్చిన వారు అంతా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా రాజ్యం చేస్తున్నారు, మరి ఇప్పటికైనా వంశీకి రాజయోగం ఉందా అన్న చర్చ అయితే ఉంది. జగన్ కనుక వంశీని ఎంపిక చేస్తే మాత్రం అది వంశీకే కాదు, బీసీలకు, యాదవ సామాజిక వర్గానికి వైసీపీకి కూడా మేలు చేసేదే అని అంటున్నారు. చూడాలి మరి జగన్ డెసిషన్.