Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుః ఏపీ బీజేపీ ఏం చేయ‌బోతోంది?

By:  Tupaki Desk   |   24 July 2021 12:44 PM GMT
విశాఖ ఉక్కుః  ఏపీ బీజేపీ ఏం చేయ‌బోతోంది?
X
విశాఖ‌ ఉక్కు ఫ్యాక్ట‌రీ అనేది కేవ‌లం ఉద్యోగాలు క‌ల్పించే సంస్థ మాత్ర‌మే కాదు.. ఆంధ్రుల‌కు దానితో అంత‌కు మించిన‌ అనుబంధం ఉంది. అలాంటి ఫ్యాక్ట‌రీని టోకున‌ అమ్మేయ‌డానికి సిద్ధ‌మైంది కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం. ఈ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా.. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రోజు నుంచి కార్మికులు ఆందోళ‌న కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రైవేటు వ్య‌క్తుల‌ చేతుల్లోకి వెళ్తే.. ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా దీనిపై ఆధార‌ప‌డి బ‌తుకుతున్న‌ ల‌క్షకు పైగా కుటుంబాల జీవితాలు ఏమైపోతాయో అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇంత జరుగుతున్నా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, విప‌క్షంలో ఉన్న టీడీపీ క‌నీసంగా కూడా స్పందించ‌ట్లేదనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న‌ది కాబ‌ట్టి.. కేంద్రంతో స‌యోధ్య కోసం మాట్లాడ‌ట్లేద‌ని అనుకున్నా.. విప‌క్షంలో ఉన్న టీడీపీ కూడా ఈ విష‌యంలో మౌనంగా ఉండ‌డం విస్మ‌య ప‌రుస్తోంది. కేవ‌లం.. భ‌విష్య‌త్ రాజ‌కీయ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకునే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ధాన‌పార్టీలు మౌనంగా ఉండ‌డంతో.. ఎప్ప‌టి లాగనే.. విశాఖ ఉద్య‌మం కూడా కమ్యూనిస్టు పార్టీలు మాత్ర‌మే చేసే పోరాటంగా మారిపోయింది.

ఈ ప‌రిస్థితి ఇలా ఉంటే.. అటు కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఫ్యాక్టరీ ప్రైవేటీక‌ర‌ణ కోసం చ‌క‌చ‌కా ప‌నులు చేసుకుంటూ వెళ్తోంది. బీజేపీ స‌ర్కారు ఇప్ప‌టికే.. ఫ్యాక్ట‌రీ విక్ర‌యానికి సంబంధించి టెండ‌ర్లు కూడా ఆహ్వానించింది. అంతేకాదు.. లీగ‌ల్ అడ్వైజ‌ర్ల‌ను కూడా నియ‌మిస్తూ.. ప్రైవేటీక‌ర‌ణ ప‌నులు వేగంగా చేస్తోంది. అనుకున్న విధంగా ప్రైవేటు సంస్థ‌లు బిడ్ దాఖ‌లు చేస్తే.. వెంట‌నే విశాఖ‌ ఫ్యాక్టరీని కూడా వారికి అప్ప‌గించేందుకు త‌గిన‌ చ‌ర్య‌లు చేప‌డుతోంది.

అయితే.. తాజాగా విశాఖ ఫ్యాక్ట‌రీ విష‌య‌మై కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడేందుకు ఏపీ బీజేపీ నేత‌లు ఢిల్లీ వెళ్ల‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే.. వీళ్లంతా వెళ్లింది ప్రైవేటీక‌ర‌ణ ఆప‌డానికా..? విశాఖ ఫ్యాక్టరీ ఖాళీ స్థలాల గురించా? అన్న‌ది ప్ర‌శ్న‌. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి సుమారు 28 వేల భూమిని సేకరించారు. అందులో పదివేల ఎకరాలు మినహా.. మిగతా 18 వేల ఎక‌రాలు ఖాళీగానే ఉండిపోయింది. త‌మ ప్రాంతానికి ఫ్యాక్టరీ వ‌స్తోంద‌న్న కార‌ణంతో.. జ‌నాలు త‌మ భూములు ఇచ్చేశారు. భూములు ఇచ్చిన వారికి ఉద్యోగం అనే రొట్ట డైలాగ్ అప్పుడు కూడా వాడారు. కానీ.. మూడొంతుల మందికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఉద్యోగ‌మూ ఇవ్వ‌లేద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే.

ఈ ప‌రిస్థితుల్లో ఒక వేళ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్య‌క్తుల‌కు అమ్మేస్తే.. ఆ మిగులు భూమిని ఏం చేస్తారు? అన్న‌ది ప్ర‌శ్న‌. ఫ్యాక్ట‌రీ కొనుగోలు చేసిన వారికి 10వేల ఎక‌రాల్లో ఫ్యాక్ట‌రీని మాత్ర‌మే ఇస్తారా? మిగిలి ఉన్న ఈ భూమిని కూడా అప్ప‌గిస్తారా? అన్న‌ది తెలియ‌దు. ఈ భూమి విలువ ఊహ‌కు అంద‌కుండా ఉంది. దాదాపు 3 ల‌క్ష‌ల కోట్ల విలువ చేస్తుంద‌ని అంచ‌నా. ఇలాంటి భూమిపై ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. అయితే.. ఈ భూముల విష‌యమై మాట్ల‌డేందుకే బీజేపీ నేత‌లు ఢిల్లీ వెళ్లార‌ని తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. విశాఖ ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ‌కు ఒక‌వైపు కేంద్రం చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేస్తుంటే.. ఫ్యాక్ట‌రీ ఎక్క‌డికీ పోదు, దాన్ని కాపాడే బాధ్య‌త మాదేన‌ని చెబుతూ వ‌స్తున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన బీజేపీ నేత‌లు. మ‌రి, ఇప్పుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న ద్వారా వీళ్లేం సాధించ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. విశాఖ ఫ్యాక్టరీ ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆప‌డానికి వెళ్లారా? భూముల గురించి మాట్లాడడానికేనా? అన్న‌ది తెలియాలి. ఇటు భూములు కోల్పోయి, అటు ఉద్యోగం రాకుండా రెండు విధాలా న‌ష్ట‌పోయిన వారికి ఈ భూములు తిరిగి ఇవ్వ‌డం ద్వారా న్యాయం చేసే అవ‌కాశాన్ని చ‌ర్చించాల‌ని చెప్పేందుకేన‌ని కొంద‌రు అంటున్నారు. , ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.