Begin typing your search above and press return to search.

అర్థరాత్రి 2 గంటలకు రాజీవ్ కు టీఎన్ శేషన్ ఎందుకు ఫోన్ చేశారు?

By:  Tupaki Desk   |   12 Jun 2023 3:34 PM IST
అర్థరాత్రి 2 గంటలకు రాజీవ్ కు టీఎన్ శేషన్ ఎందుకు ఫోన్ చేశారు?
X
చరిత్రలోజరిగిపోయిన కొన్ని ఘట్టాలు ఎంతో ఆలస్యంగా ఆత్మకథల రూపంలో అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. భారత ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ఆ పదవికే వన్నె తెచ్చి.. ఆ పదవికి కొత్త కళను తీసుకొచ్చిన ఘనత మాజీ సీఈసీ టీఎన్ శేషన్ కే దక్కుతుంది. అప్పటి రోజుల్లో ముక్కుసూటితనంగా పని చేయటం ఎలా అన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా టీఎన్ శేషన్ నిలిచారు. 2019లో మరణించిన టీఎన్ శేషన్.. తన ఆత్మకథ 'త్రూ ది బ్రోకన్ గ్లాస్' ను పబ్లిష్ చేశారు. ఇందులో ఆసక్తికర విశేషాలెన్నో.

అన్నింటికి మించి తాను భారత ఎన్నికల ప్రధానాధికారి పదవిని చేపట్టటానికి ముందు ఏం జరిగింది? తనకు ఆ పదవిని ఎన్నిగంటల వేళలో ఆఫర్ చేశారు? ఆ తర్వాత తాను సంప్రదించిన ముగ్గురు వ్యక్తులు ఎవరు? వారేం చెప్పారు? లాంటి విసయాల్ని శేషన్ తన ఆత్మకథలో వివరించారు. ఆసక్తికరంగా ఉన్న ఈ విశేషాన్ని ఆయన మాటల్లోనే చదివితే.. ''1990లో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వానికి కేబినెట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న వినోద్ పాండే నుంచి ఫోన్ వచ్చింది. అప్పట్లో నేను ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా పని చేస్తున్నా. మిమ్మల్ని సీఈసీగా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఆఫర్ ను అస్సలు ఊహించనిది. ఎందుకంటే.. ఎప్పుడూ ఆ పదవి గురించి ఆలోచించింది లేదు. ఎన్నికలతో ఎప్పుడూ సంబంధం లేదు కదా? ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నా. నో చెప్పేద్దామనిపించింది'' అని పేర్కొన్నారు.

దాని కొనసాగింపుగా ఆయన ఏం చెప్పారంటే.. ''అంతలో న్యాయశాఖ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఫోన్ చేవారు. మీ జవాబు ఏమిటో చెప్పాలి. దాని ప్రకారం మేం మిగిలిన ప్రాసెస్ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో.. కన్ఫ్యూజ్ కు గురయ్యా. ఎవరిని సలహా అడగాలా? అన్నది ప్రశ్నగా మారింది. అప్పుడు నా మనసులోకి వచ్చిన వ్యక్తులు ఇద్దరే. అప్పుడు సమయం అర్థరాత్రి రెండు గంటలు అవుతోంది. ఆలస్యం చేయకుండా మొదటి వ్యక్తికి ఫోన్ చేస్తే.. ఆ టైంలో ఫోన్ ఎత్తారు. ఫోన్ చేసింది మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి.

ఏమిటి? విషయమని అడిగారు. విషయం చెప్పాను. వెంటనే బయలుదేరి రమ్మన్నారు. రాజీవ్ గాంధీ నివాసానికి అర్థరాత్రి 2.30 గంటల వేళకు చేరుకున్నాను. గతంలో రాజీవ్ ప్రభుత్వంలో కేబినెట్ కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉంది. అందుకే ఆ చనువు. ఆయనకు నా గురించి అంతా తెలుసు' అని చెప్పుకొచ్చారు.

అంత అర్థరాత్రి వేళ రాజీవ్ ను కలిసిన సందర్భంలో ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. 'ఏమిటీ? నీకు సీఈసీ పోస్టా? తర్వాత వాళ్లు పశ్చాత్తాపపడతారు. నీకు ఈ ఉద్యోగం మంచిది కాదు. ప్రధాని చంద్రశేఖర్ కు మంచిది కాదు. ఇంకేం అవకాశం లేకపోతేనే దీని గురించి ఆలోచించు. దీంతో రెండో వ్యక్తిని సంప్రదించా. రమ్మంటే వెళ్లాను. నేను వెళ్లింది రాష్ట్రపతి నిలయానికి. రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ కు కలిసి విషయమంతా చెబితే.. సీఈసీ ఉద్యోగం నీకు సరి కాదు.

మరో దారి లేకపోతే ఆలోచించు అని రాజీవ్ మాదిరే సలహా ఇచ్చారు. దీంతో.. మళ్లీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వేళలో.. మూడో అభిప్రాయం కింద మరో ప్రముఖుడికి ఫోన్ చేశా. ఆయనే కంచి మఠంలోని ప్రముఖుడు. ఆయన ఫోన్ లో నేను చెప్పింది విన్నంతనే.. 'చాలా గౌరవప్రదమైన పదవి. వెంటనే స్వీకరించు' అని చెప్పారు. మరో.. ఆలోచన చేయకుండా వెంటనే.. సీఈసీ పదవికి సిద్ధమని మంత్రి సుబ్రహ్మణ్యస్వామికి ఫోన్ చేసి చెప్పేశా'' అంటూ ఆయన తన ఆత్మకథలో జరిగిన విషయాల్ని పూసగుచ్చినట్లుగా వెల్లడించారు.