Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఊహించింది బీజేపీ చేస్తుందా?

By:  Tupaki Desk   |   23 July 2022 12:30 AM GMT
ప‌వ‌న్ ఊహించింది బీజేపీ చేస్తుందా?
X
ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ -జ‌న‌సేన సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ సభ‌లో తాను బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నాన‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే బీజేపీ రోడ్ మ్యాపేమీ ఇవ్వ‌లేదు.

ఆ త‌ర్వాత జ‌న‌సేన పార్టీ ముఖ్య నేత‌లు, జిల్లాల అధ్య‌క్షులతో స‌మావేశం నిర్వ‌హించిన ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి త‌న ముందు మూడు ఆప్ష‌న్లు ఉన్నాయ‌ని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ-టీడీపీతో క‌ల‌సి వెళ్ల‌డం, లేదా కేవ‌లం బీజేపీతో క‌ల‌సి పోటీ చేయ‌డం, లేదా ఒంట‌రిగా పోటీ చేయ‌డం అని ప‌వ‌న్ త‌న మూడు ఆప్ష‌న్లను ప్ర‌క‌టించారు.

అదే స‌మ‌యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా ఏపీ ప‌ర్య‌టన‌కు వ‌చ్చారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో భారీ స‌భ నిర్వ‌హించారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎలాంటి ఆహ్వానం ల‌భించ‌లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ ను త‌మ కూట‌మి త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తార‌ని కూడా ముందు వార్త‌లు వ‌చ్చాయి. అయితే జేపీ న‌డ్డా అదేమీ చేయ‌లేదు. పైగా ఎక్క‌డా జ‌న‌సేన పార్టీ పేరు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు తీయ‌లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంట‌రిగా పోటీ చేసి ఏపీ అధికారంలోకి రావాల‌ని కోరారు. ఇందుకు కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీ అధిష్టానంపై కినుక వ‌హించార‌ని.. ఈ కార‌ణంతోనే ఇటీవ‌ల న‌రేంద్ర మోడీ భీమ‌వ‌రం ప‌ర్య‌ట‌న‌కు ఆహ్వానించినా డుమ్మా కొట్టార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అలాగే ఇటీవ‌ల జ‌రిగిన ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లోనూ బీజేపీకి మ‌ద్ద‌తుగా ఒక్క మాట బ‌య‌ట‌, సోష‌ల్ మీడియాలోనూ కూడా పేర్కొన‌లేద‌ని అంటున్నారు. అలాగే జూలై 22న రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు కార్య‌క్ర‌మానికి రావాల‌ని ఆహ్వానించినా ఆరోగ్య కార‌ణాల‌ను చూపి రాలేన‌ని ప‌వ‌న్ పేర్కొన్నార‌ని అంటున్నారు.

ఇలా బీజేపీ అధిష్టానంపై కినుక వ‌హించి త‌న అసంతృప్తిని తెలియ‌జేస్తే.. త‌న అసంతృప్తి కార‌ణాలు ఏంటో బీజేపీ అధిష్టానం ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలుసుకుంటార‌ని ప‌వ‌న్ భావిస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే తానొక‌టి త‌ల‌స్తే.. దైవం ఒక‌టి త‌ల‌చిన‌ట్టు ప‌వ‌న్ అనుకుంటున్న‌ట్టు బీజేపీ అధిష్టానం ఆయ‌న‌ను బుజ్జ‌గించ‌ద‌ని అంటున్నారు. భీమ‌వ‌రంలో ప్ర‌ధాని మోడీ కార్య‌క్ర‌మాన్ని, ఇప్పుడు రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు కార్య‌క్ర‌మాన్ని ప‌వ‌న్ కావాల‌నే ఉద్దేశ‌పూర్వ‌కంగా చేశార‌ని బీజేపీ అధిష్టానం భావిస్తోంద‌ని పేర్కొంటున్నారు.

ప‌వ‌న్ ను బుజ్జ‌గిస్తే ఆయ‌న పెట్టే డిమాండ్ల‌న్నింటికీ తాము ఒప్పుకోవాల్సి వ‌స్తుంద‌ని.. అందుకే ఆ ప‌ని చేయ‌కూడ‌ద‌ని బీజేపీ అధిష్టానం త‌ల‌పోస్తున్న‌ట్టు చెప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఆశించిన‌ట్టు బీజేపీ చేయ‌బోద‌ని అంటున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో జ‌న‌సేనాని త‌దుప‌రి ఏం స్టెప్ వేస్తారో వేచి చూడాల్సిందేన‌ని చెబుతున్నారు.