Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఎన్నికలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ చుట్టూ తిరుగుతాయా?

By:  Tupaki Desk   |   20 Nov 2020 6:45 AM GMT
గ్రేటర్ ఎన్నికలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ చుట్టూ తిరుగుతాయా?
X
రాజకీయం అంటేనే భావోద్వేగం. అలాంటిది రాజకీయాల్లో కీలకమైనది.. అధికారాన్ని చేతికి ఇచ్చే ఎన్నికలు రాజకీయ పార్టీలు ఎంత అలెర్టుగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎత్తులు.. పైఎత్తులతో పాటు.. ప్రత్యర్థుల్ని తమ గేమ్ లో భాగం అయ్యేలా చేసుకోవటంలోనే తెలివంతా ఉంటుంది. తాము డిసైడ్ చేసిన ఎజెండా చుట్టూ తిరిగేలా పార్టీలు ప్లాన్ చేస్తాయి. ఇలాంటివి అర్థం చేసుకొని.. తిరిగి వాటికి రియాక్టు అయ్యేలా పైఎత్తులు వేయటం అంత తేలికైన విషయం కాదు.

ఇలాంటి మైండ్ గేమ్ దుబ్బాకలో జరగటం.. గులాబీ నేతలు పెద్దగా రియాక్టు కాకపోవటంతోజరగాల్సిన నష్టం భారీగా జరిగిపోయింది. గ్రేటర్ లోనూ అలాంటి సీనే రిపీట్ చేసేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. అలవాటైన గేమ్ కావటం.. బీజేపీ నేతలకు పెద్ద కష్టం కాదు. కానీ.. ఆటను.. ఆట స్వరూపాన్ని అర్థం చేసుకొని ప్రత్యర్థి పార్టీకి కౌంటర్ ఇచ్చేలా రియాక్టు కావటంలో టీఆర్ఎస్ నేతలు తడబాటుకు గురవుతున్నారు. ఈ లోపాన్ని గుర్తించిన కమలనాథులు మరింతలా చెలరేగిపోతున్నరు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో హరీశ్ నోటి వెంట వచ్చిన పాత బస్టాండ్ మాటను.. తమకు అనుకూలంగా మార్చుకోవటంలో సక్సెస్ అయ్యరు బీజేపీ నేతలు. గ్రేటర్ ఎన్నికల్లోనూ అలాంటి ఎత్తుగడనే వారు సంధిస్తున్నారు. వరదల కారణంగా జరిగిన నష్టానికి పరిహారాన్ని ఇచ్చేందుకు రూ.10వేల మొత్తాన్ని ఇవ్వటం తెలిసిందే. మొదట్లో నగదును.. తర్వాతి కాలంలో అకౌంట్లో క్యాష్ వేస్తున్న వేళ.. పెద్ద ఎత్తున పరిహారం కోసం ప్రజలు ముందుకు రావటం.. గందరగోళం చోటు చేసుకుంది.

ఈ అంశంపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పరిహారాన్ని ప్రస్తుతానికి ఆపేయాలని.. ఎన్నికల తర్వాత పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల సంఘం నోటి నుంచి ఈ మాట రావటానికి కారణం బీజేపీనే అంటూ కొత్త మాట తెర మీదకు వచ్చింది. తమను దెబ్బ తీసేందుకే ఇలాంటి ప్రచారాన్ని గులాబీ నేతలు మొదలు పెట్టారని బండి సంజయ్ భావిస్తున్నారు. పరిహారం ఆపేయాలంటూ తన పేరు మీద వైరల్ అవుతున్న లెటర్ పై వివరణ ఇచ్చారు బండి సంజయ్. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. ఒక ప్లాన్ ప్రకారమే ఇలాంటివి చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ను దుయ్యబట్టారు.

ఈ అంశంపై సీఎం కేసీఆర్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు బండి సంజయ్. పరిహారం ఆపాలంటూ తాను లేఖ రాయలేదని.. చార్మినార్ మహలక్ష్మీ ఆలయం వద్ద తాను ప్రమాణం చేస్తానని.. అందుకు తగ్గట్లే సీఎం కేసీఆర్ కూడా వచ్చి.. తాను ఆ పత్రాన్ని వైరల్ చేయించలేదని ప్రమాణం చేస్తారా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన ఈ వ్యవహారం అధికారపార్టీకి ఇప్పుడు అయోమయానికి గురి చేస్తోంది.

చార్మినార్ మహలక్ష్మీ ఆలయానికి దమ్ముంటే కేసీఆర్ రావాలని.. లేకుంటే బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం పన్నెండు గంటలకు చార్మినార్ మహలక్ష్మీ టెంపుల్ వద్దకు వెస్తున్నట్లుగా బండి సంజయ్ పేర్కొన్నారు. మరి.. ఈ సవాలుకు టీఆర్ఎస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ప్రశ్నగా మారింది. మొత్తంగా చూస్తే.. దుబ్బాకలో పాతబస్టాండ్ సవాలు తమకు అనుకూలంగా మారిన నేపథ్యంలోచార్మినార్ మహలక్ష్మీ టెంపుల్ సవాల్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రభావాన్ని చూపుతుందన్న మాట వినిపిస్తోంది.