Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌కు పెద్ద టాస్క్‌.. : ముహూర్తం బాగుంది.. మ‌రి పార్టీని మురిపిస్తారా?!

By:  Tupaki Desk   |   13 July 2023 1:31 PM GMT
చిన్న‌మ్మ‌కు పెద్ద టాస్క్‌.. : ముహూర్తం బాగుంది.. మ‌రి పార్టీని మురిపిస్తారా?!
X
ఏపీ బీజేపీ చీఫ్‌గా ఎన్టీఆర్ కుమార్తె దుగ్గుబాటి పురందేశ్వ‌రి.. వారం.. వ‌ర్జ్యం.. ముహూర్తం.. తారాబ‌లం అన్నీ చూసుకుని.. బాధ్య‌తలు చేప‌ట్టారు. ఎప్పుడో వారం కింద‌టే ఆమె నియామ‌కం అయిపోయి.. త‌క్ష‌ణం ఈ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌చ్చేస్తాయ‌ని.. పార్టీ అధిష్టానం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. ముందు ఆషాఢం అనుకుని కొంత‌మేర‌కు వెన‌క‌డుగు వేశారు. అయితే.. అధిష్టానం గ‌ట్టిగా చెప్ప‌డంతోపాటు.. ఎన్నిక‌ల‌కు స‌మ‌యంలో లేద‌ని వెల్ల‌డించ‌డంతో పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి.. విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. స‌రే.. ముహూర్తం బాగానే ఉన్నా.. పార్టీని ఎంత వ‌ర‌కు ఆమె మురిపిస్తార‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఏంటి స‌మ‌స్య‌?

ఔను.. ఏపీ బీజేపీ అంటేనే పెద్ద స‌మ‌స్య అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. మూడు ప్రాంతాల్లోని నాయ‌కుల‌కు ముప్పై విధాల ఆలోచ‌న‌ల‌తో ఉన్నారు. కొంద‌రు త‌మ‌కు కేంద్రంలో ప‌లుకుబ‌డి ఉంద‌ని చెప్పుకొనేవారు.. మ‌రికొంద‌రు సుదీర్ఘ కాలంగా పార్టీ పునాదుల‌ను ప‌టిష్టం చేశామ‌ని చెప్పుకొనేవారు.. ఇంకొంద‌రు.. ప్ర‌జ‌ల్లో మాకు ఆద‌ర‌ణ ఉంద‌ని వెల్లడించేవారే ఉన్నారు. దీంతో పార్టీ చీఫ్‌ల‌కు వాల్యూ లేకుండా చేసుకున్నారు. పార్టీ చీఫ్ ఒక‌టి చెబితే.. నాయ‌కులు మ‌రొక‌టి చెప్పిన సంద‌ర్భాలు అనేకం.

సీనియ‌ర్లు ఉండ‌డం.. మెలితిరిగిన అనుభ‌వం ఉన్న‌వారు ఉండ‌డం.. కేంద్రంలోని పెద్ద‌ల‌తో నిత్యం మాట్లాడే చ‌నువు ఉన్న‌వారు ఉండ‌డం నిజానికి మంచిదే. అయితే.. ఇది పార్టీ అభివృద్ధికి ఏమేర‌కు ప‌నిచేస్తోద‌నేది ప్ర‌శ్న‌.

ప‌దువుల‌పై అసంతృప్తితో ఉన్న‌వారు.. పొరుగు పార్టీల‌వైపు చూస్తున్న‌వారు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోతాము అనుకున్న‌ వ్యూహాల‌కు అధిష్టానం జైకొట్టాల‌ని భావిస్తున్న‌వారు.. ఇలా అనేక రూపాల్లో నాయ‌కులు ఉన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత వ‌ర‌కు.. ఇలాంటి వారిని లైన్‌లో పెట్ట‌డం.. బీజేపీ చీఫ్‌లుగా ప‌నిచేసిన‌.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, సోము వీర్రాజు వంటివారికి సాధ్యం కాలేదు. పైగా.. వీరు ప్ర‌య‌త్నించినా.. వీరిపై టీడీపీ అనుకూల‌, వైసీపీ అనుకూల ముద్రలు(దీనిలో వారు చేసుకున్న‌ది కూడా కొంత ఉంది) వేసేసి.. ఎట్ట‌కేల‌కు ప‌క్క‌న పెట్టేలా వ్యూహం అమ‌లు చేసుకున్నారు. ఇది కీల‌క నాయ‌కుల గురించిన ప్ర‌స్థావ‌న మాత్ర‌మే.

వీరిని ముందు లైన్‌లో పెట్ట‌డం.. పురందేశ్వ‌రి ముందు ఉన్న ప్ర‌థాన క‌ర్త‌వ్యం. ఇది సాధ్య‌మేనా? చూడాలి. దీని త‌ర్వాతే.. ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం.. ఓటు బ్యాంకు పెంచుకోవ‌డ‌మ‌నే మ‌రో రెండు ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఉన్నాయి. మ‌రో 8 మాసాల్లోనే ఎన్నిక‌ల గంట మోగ‌నున్న నేప‌థ్యంలో పురందేశ్వ‌రి ఎంత ముహూర్తాలు చూసుకుని పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టినా.. మురిపించ‌డం ఏమేర‌కు సాధ్య‌మ‌వుతుంద‌నేది ప్ర‌శ్న‌. చూడాలి.. అన్న‌గారి కూతురికి వ‌చ్చిన అరుదైన అవ‌కాశాన్ని ఎలా వినియోగించుకుంటారో.