Begin typing your search above and press return to search.

కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారా ?

By:  Tupaki Desk   |   11 March 2023 11:04 AM GMT
కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారా ?
X
సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారా ? అవుననే సమాధానం వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కమలం కండువా కప్పుకోవటానికి కిరణ్ సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరబోతున్న కిరణ్ ఎలాంటి పాత్రను పోషించబోతున్నారనే విషయంపైన మాత్రం క్లారిటిలేదు. పుట్టింది, పెరిగింది, రాజకీయ వేదికంతా ఏపీనే అయినప్పటికీ కిరణ్ కు తెలంగాణాతో కూడా బాగా సన్నిహిత సంబంధాలున్నాయి.

అందుకనే తెలంగాణా బీజేపీలో కిరణ్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ఈ మాజీ ముఖ్యమంత్రితో ఫోన్లో మంతనాలు జరిపారట. రెండురోజుల్లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి వెంటనే ఢిల్లీలోని అగ్రనేతలతో భేటీ అవుతారని సమాచారం. మరి కిరణ్ బీజేపీకి ఏ విధంగా ఉపయోగపడతారో ఎవరికీ అర్ధంకావటంలేదు. కిరణ్ చదువుకున్నదంతా హైదరాబాద్ లోనే. రాజకీయాలు మొదలుపెట్టింది కూడా హైదరాబాద్ లోనే. తండ్రి వారసత్వంగా వచ్చిన రాజకీయాలు కాబట్టి తండ్రి నల్లారి అమర్నాధరెడ్డి మరణం తర్వాత పీలేరు నుండి రాజకీయాల్లోకి డైరెక్టు ఎంట్రీ ఇచ్చారు.

పీలేరులోనే గెలిచి ఓడుతున్నారు కాబట్టి నియోజకవర్గంలో తిరుగులేని నేతనేందుకు లేదు. ఇదే సమయంలో నియోజకవర్గంలో అపారమైన పట్టుందా అంటే అదీలేదు. పీలేరుకు మాత్రమే పరిమితమైన కిరణ్ కు అదృష్టం పట్టి ఏకంగా ముఖ్యమంత్రయిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కానీ సీఎంగా ప్రభుత్వంమీద కానీ కిరణ్ కు ఎలాంటి పట్టుండేది కాదు.

అందుకనే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. జై సమైక్యపార్టీ పేరుతో పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో పోటీచేస్తే కిరణ్ తో సహా అభ్యర్ధులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అప్పటినుండి కొంతకాలం స్తబ్దుగా ఉండి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోనే చేరారు. పార్టీలో చేరినా ఎవరినీ కలిసింది లేదు, పర్యటనలు చేసిందీలేదు. ఎందుకంటే కిరణ్ మాటవినే నేతలు ఎవరూ కాంగ్రెస్ లేరు కాబట్టే. ఏదో మాజీ ముఖ్యమంత్రి పార్టీలో చేరుతున్నారే ముచ్చటే కానీ కిరణ్ వల్ల బీజేపీకి పెద్దగా లాభం ఉంటుందనేందుకు లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.