Begin typing your search above and press return to search.

కర్ణాటక ఎన్నికలు బీజేపీ ప్రచారానికి పవన్‌ వెళ్తారా?

By:  Tupaki Desk   |   21 April 2023 6:00 AM GMT
కర్ణాటక ఎన్నికలు బీజేపీ ప్రచారానికి పవన్‌ వెళ్తారా?
X
కర్నాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో కర్ణాటక సరిహద్దులు పంచుకుంటోంది. తెలుగు ప్రజలు సరిహద్దు ప్రాంతాలతోపాటు బెంగళూరు నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో అధికార బీజేపీ సినీ నటుల చరిష్మాపైన ఆధారపడుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ను ప్రచారానికి రప్పించాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. ఏపీ సరిహద్దుల్లో కర్ణాటకలో ఉన్న బాగేపల్లి, చిక్‌ బళ్లాపూర్, కోలార్, బళ్లారి, హోస్పేట, రాయచూరు, సింధనూరు తదితర ప్రాంతాలతోపాటు బెంగళూరు నగరంలోనూ పవన్‌ తో బీజేపీ విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అందులోనూ ఏపీలో జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయడానికి నిర్ణయించాయి, ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పవన్‌ ఢిల్లీ బీజేపీ జాతీయ పెద్దలను కలసి వచ్చారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం, బలంగా బీజేపీ ఉన్న రాష్ట్రం ఒక్క కర్ణాటక మాత్రమే. ఈ నేపథ్యంలో అక్కడ అధికారాన్ని పోగొట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని అంటున్నారు.

తెలుగు ప్రజలు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లో పవన్‌ కల్యాణ్‌ చేత ప్రచారం చేయించాలని బీజేపీ నిర్ణయించుకుందని చెబుతున్నారు. అయితే ఏపీలో తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌ రావు కన్నుమూశాక జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరఫున ఐఏఎస్‌ అధికారిణి రత్న ప్రభ పోటీ చేశారు. అప్పుడు పవన్‌ కల్యాణ్‌ తిరుపతి ఎంపీకి జరిగిన ఉప ఎన్నికలో ప్రచారం చేశారు.

అయితే ఆ తర్వాత వైఎస్సార్‌ జిల్లా బద్వేలు, నెల్లూరు జిల్లా ఆత్మకూరుల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు చోట్లా బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. అయితే పవన్‌ కల్యాణ్‌ కానీ, జనసేన పార్టీ నేతలెవరూ అటు వైపు తొంగి చూడలేదు.

అదేవిధంగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగారు. ఎక్కడా వీరికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే ఓటేయాలని పవన్‌ పిలుపునిచ్చారు తప్ప బీజేపీకి వేయమని కోరలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు ఉన్న చోట సొంత రాష్ట్రంలోనే బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి రాని పవన్‌ కర్ణాటకలో ఎలా ప్రచారానికి వస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పవన్‌ ఖచ్చితంగా ఎన్నికల ప్రచారానికి రారని అంటున్నారు. అందులోనూ పవన్‌ ఇప్పుడు వరుస సినిమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. కాబట్టి ప్రచారం ఉత్తదేనని అంటున్నారు.