Begin typing your search above and press return to search.

విజయవాడలో మహిళ సజీవదహనం.. ప్రేమించలేదని కాల్చేశాడు

By:  Tupaki Desk   |   13 Oct 2020 11:15 AM IST
విజయవాడలో మహిళ సజీవదహనం.. ప్రేమించలేదని కాల్చేశాడు
X
మనిషికి ఏమైంది? ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న నేరాల్ని చూస్తుంటే ఈ సందేహం రాక మానదు. ప్రేమించమని వెంటపడిన ప్రతి ఒక్కడిని అమ్మాయిలు ప్రేమించాలా? వారు చెప్పినట్లే వినాలా? డిజిటల్ యుగంలోనూ అనాగరికంగా వ్యవహరిస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా విజయవాడలో చోటు చేసుకున్న ఈ ఘోరం గురించి విన్నంతనే షాక్ కు గురి కావాల్సిందే.

తాను వెంటపడుతున్నాతనను ప్రేమించని అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేసిన వైనం వింటే.. మనసు అంతా చేదుగా మారిపోవటం ఖాయం. తనను వేధింపులకు గురి చేస్తున్నయువకుడిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మహిళ ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ప్రేమోన్మాది చేతిలో అన్యాయంగా బలైంది. క్రిష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఒక కోవిడ్ సెంటర్ లో నర్సుగా పని చేస్తోంది. ఫ్రెండ్స్ తో కలిసి ఒక గదిలో అద్దెకు ఉంటోంది.

ఆమెను నాగభూషణం అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిన్నారి జోలికి తానిక వెళ్లనని.. ఆమెను ఏమీ చేయనని రాతపూర్వకంగా రాసిచ్చాడు. దీంతో.. ఆమె తానిచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసేసుకుంది.

ఇదిలా ఉంటే.. సోమవారం రాత్రి తొమ్మిది గంటల వేళలో ఆసుపత్రి నుంచి విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న వేళలో.. నాగభూషణం ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో.. వాగ్వాదానికి దిగిన నాగభూషణం.. తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఆమె మీద పోసి నిప్పు అంటించాడు. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ ఘటనలో ఆమె పూర్తిగా కాలిపోయి చనిపోయింది. ఈ ఉదంతంలో నాగభూషణంకు మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలైన అతడ్ని జీజీహెచ్ కు తరలించారు. ఈ ఘటన బెజవాడలో సంచలనంగా మారింది.