Begin typing your search above and press return to search.

కొండా రెడ్డి అరెస్ట్ వెనుక క‌ర్ణాట‌క బీజేపీ హ‌స్తం!?

By:  Tupaki Desk   |   10 May 2022 2:24 PM GMT
కొండా రెడ్డి అరెస్ట్ వెనుక క‌ర్ణాట‌క బీజేపీ హ‌స్తం!?
X
2019 ఎన్నిక‌ల్లో గెలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం అందుకున్న‌ప్ప‌టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల హ‌వా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఆ పార్టీ నేత‌ల‌కు ఎక్క‌డా ఎవ‌రూ ఎదురు చెప్పే ప‌రిస్థితి లేదు. ఏ కాంట్రాక్టు అయినా వారి చేతికి వెళ్లాల్సిందే!. వేరే వాళ్లు కాంట్రాక్టులు చేస్తే స్థానిక నాయ‌కుల‌కు వాటాలు ఇవ్వాల్సిందే!.

ఇది ఏ ప్ర‌భుత్వంలో అయినా ఉండేదే కానీ.. వైకాపా హ‌యాంలో ఈ దౌర్జ‌న్యాలు మ‌రీ హ‌ద్దులు దాటిపోయాయ‌నే విమ‌ర్శ‌లున్నాయి!. ఐతే ఇలాంటి ప‌రిస్థితుల్లో సీఎం సొంత జిల్లాలో ఒక వైకాపా నేత‌ను పోలీసులు అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌నం రేపింది. పోలీసుల‌కు ఇంత ధైర్యం ఎలా వ‌చ్చింది.. దీన్ని అధికార పార్టీ నేత‌లు ఎలా చూస్తూ ఊరుకున్నారు అనే సందేహం క‌ల‌గ‌డం స‌హ‌జం. కానీ ఇక్క‌డే ఉంది ట్విస్ట్. కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ.. ఢిల్లీ స్థాయిలో ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోవ‌డంతోనే కొండారెడ్డి అనే క‌డ‌ప ప్రాంత నేతను అరెస్ట్ చేయాల్సిన ప‌రిస్థితి త‌లెత్తిన‌ట్లు స‌మాచారం. ప్రచారం లో ఉన్న వివ‌రాల్లోకి వెళ్తే..

కర్నూలు జిల్లాలోని చాగలమర్రి నుంచి గ‌తంలో క‌డ‌ప ప‌రిధిలో ఉండి, ఇప్పుడు అన్న‌మ‌య్య జిల్లాలోకి మారిన రాయ‌చోటి వ‌ర‌కు రూ.350 కోట్లతో 143కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు జ‌రుగుతున్నాయి. ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ అనే సంస్థ ఈ ప‌నులు చేప‌డుతోంది. ఐతే ఇందులో వాటా కోసం ఈ కంపెనీ ప్ర‌తినిధుల‌ను కొండారెడ్డి బెదిరించాడని అంటున్నారు . రూ.5 కోట్ల మేర అత‌ను డిమాండ్ చేసాడని అంటున్నారు .

ఐతే ఈ కాంట్రాక్టు విష‌యంలో తాము రాయ‌చోటి ఎమ్మెల్యే, కడప ఎంపీతో మాట్లాడుకున్నామని ఆ సంస్థ ప్ర‌తినిధులు చెప్పారని అంటున్నారు .. చ‌క్రాయ‌పేట వైసీపీ ఇన్‌ఛార్జ్ అయిన కొండారెడ్డి ఎమ్మెల్యే ఎవ‌డు, ఎంపీ ఎవడు, ఇది నా అడ్డా అంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయినట్లు తెలిసింది అని అంటున్నారు . ఐతే ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్‌ అధినేత అయిన‌ రవికుమార్‌రెడ్డి.. తన వియ్యంకుడు, క‌ర్ణాట‌క‌లోని బళ్లారి ఎమ్మెల్యే శ్రీరాములు (బీజేపీ) దృష్టికి విష‌యం తీసుకెళ్లార‌ట‌.

శ్రీరాములుకు కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వంతో మంచి సంబంధాలున్నాయి. అత‌ను బీజేపీ పెద్ద‌ల‌కు విష‌యం చెప్ప‌గా.. వారు సీఎం జగన్‌ దృష్టికి ఈ వ్య‌వ‌హారాన్ని తీసుకెళ్ల‌డం, ఈ క్ర‌మంలో కొండారెడ్డిని చక్రాయపేట పోలీసులు కడపలో అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌డం జరిగిందని ప్రచారం జరుగుతుంది . కొండారెడ్డికి కోర్టు రిమాండ్‌ విధించగా, రాయచోటి సబ్‌జైలుకు తరలించారు.