Begin typing your search above and press return to search.

వైఎస్ ఆర్ స్మృతి వనం..ఎన్నెన్ని ప్రత్యేకతలంటే?

By:  Tupaki Desk   |   11 Oct 2019 4:28 PM GMT
వైఎస్ ఆర్ స్మృతి వనం..ఎన్నెన్ని ప్రత్యేకతలంటే?
X
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి - ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా వరుసగా రెండు పర్యాయాలు బాధ్యతలు చేపట్టిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి... రెండో దఫా అధికార పీఠాన్ని దక్కించుకున్న అనతి కాలంలోనే హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లకాల్వ పరిధిలోని నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోగా... వైఎస్ కూడా అక్కడే తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో వైఎస్ జ్జాపకార్థం నల్లకాల్వ సమీపంలో వైఎస్ ఆర్ స్మృతి వనం ఏర్పాటైన సంగతీ తెలిసిందే. వైఎస్ మరణం ఎప్పటికప్పుడు కొంగొత్త వృక్షాలు - మొక్కలతో ఈ వనాన్ని అధికారులు మస్ట్ వాచ్ డెస్టినేషన్ గా మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ ఆర్ స్మృతి వనంలో కొత్తగా ఏర్పాటైన పవిత్ర వనం - నక్షత్ర వనం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

అసలు ఈ కొత్త వనాల్లో ఏమున్నాయన్న విషయానికి వస్తే... శ్రీరాముడి పత్ని సీతను అపహరించిన రావణాసురుడు లంకలోని అశోకవనంలో నిర్భందించిన సమయంలో జీవవైవిధ్యానికి ప్రతిరూపమైన అశోక వృక్షం కిందనే సేదదీరారు. ఈ వృక్షాన్నే సరాక్‌ అశోకంగా చెబుతారు. ఈ అరుదై వృక్షం భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో మాత్రమే ఉందనేవారు. కాని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమలలో కూడా ఇది కనిపిస్తోంది. ఈ వృక్షాన్ని వైఎస్‌ఆర్‌ స్మృతివనంలోని పవిత్రవనంలో నాటిన అధికారులు వనానికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చారు. ఆఫ్రికా ఖండంలోని పలు అరణ్యాలలో కనిపించే భారీ వృక్షం అడెన్‌ సోనియా. దీనిని ఏనుగు చెట్టు అని కూడా అంటారు. వరపగ్గం తిరిగే వలయం ఉన్న ఈ చెట్టు ఆఫ్రికాలో 2500 ఏళ్లకు పైగానే జీవిస్తుందట. ఈ వృక్షాలు మన దేశంలో కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఎవరో ఎపుడో తెచ్చినాటిన ఈ వృక్షాలు జిల్లాలోని గార్గేయపురం వద్ద కూడా ఉన్నాయి. వాటిలోని ఒక వృక్షాన్ని ట్రీ ట్రాన్స్‌ లొకేషన్‌ పద్ధతిలో తీసుకు వచ్చి వైఎస్‌ఆర్‌ స్మృతివనంలో పునఃప్రతిష్టించారు.

వైఎస్‌ఆర్‌ స్మృతివనాన్ని బహుళ అభిరుచుల ఆలవాలంగా నెలకొల్పేందుకు అధికారులు కొన్ని కచ్చితమైన మార్గ దర్శనాలను అనుసరించారు. అందులో ఆధ్యాత్మిక ప్రశాంతత ఒకటి. జీవవైవిధ్యంతో పాటు హిందూ, క్రిష్టయన్, ఇస్లాం మత గ్రంథాల్లో , ప్రవచనాల్లో, పురాణాల్లో కనిపించిన, ప్రస్తావించిన మొక్కలను, వృక్షాలను చాలా మటుకు పవిత్ర వనంలో చేర్చారు. అందులో మహాశివుడి కళ్ల నుంచి పుట్టిందని చెప్పబడే రుద్రాక్ష, అమరకోశంలో ప్రస్తావించ బడిన పొగడ, మత్స్య పురాణంలో చెప్పబడిన శతావరి, మహాభారత, వాయు, వరాహ, వామన పురాణాలలో మహాభారత ఇతిహాసంలో కనపడే పారిజాతంతో పాటు ముస్లింలు దంతావధానానికి వినియోగించే మిష్వాక్, క్రిస్‌మస్‌ ట్రీకి పాకించే పిల్లి తీగల వంటి అనేక పౌరాణిక సంబంధ వృక్షజాతులను వైఎస్‌ఆర్‌ స్మృతివనంలోని పవిత్రవనంలో ఉంచారు.

ప్రతి మనిషికి జన్మించిన ఘడియలను బట్టి ఓ జన్మనక్షత్రం ఉండి తీరుతుంది. 27 నక్షత్రాలకు అనుసంధానమైన వృక్షాలను వైఎస్‌ఆర్‌ స్మృతివనంలో ఒక చోట చేర్చి దాన్ని నక్షత్రవనంగా నామకరణం చేశారు. తమ జన్మ నక్షత్రానికి అనుసంధానమైన వృక్షం కింద యోగా చేసుకుని మానసిక ప్రశాంతత పొందేందుకు ఎందరో ఇక్కడికి వస్తుంటారు. ఇవే కాకుండా ఆరు రాశులకు, సప్తరుషులకు, నవగ్రహాలకు కూడా ప్రత్యేక అనుసంధాన మొక్కలు వృక్షాలు, మొక్కలు వైఎస్‌ఆర్‌ స్మృతివనంలో ఉన్నాయి. స్మృతివనం సందర్శనకు వచ్చే పర్యాటకులు ఈ విషయాలు తెలుసుకుని కాసేపు ఇక్కడ సేద తీరి మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలతో ఎప్పటికప్పుడు కొత్త శోభను సంతరించుకుంటున్న వైఎస్ఆర్ స్మృతి వనం ఇప్పుడు నిజంగానే ఒక్కసారి అయినా తప్పనిసరిగా సందర్శించదగ్గ వనంగా మారిపోయిందన్న వాదన వినిపిస్తోంది.