Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను ప్ర‌శంసించిన ఏపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   3 Feb 2017 5:04 PM
కేసీఆర్‌ ను ప్ర‌శంసించిన ఏపీ ఎమ్మెల్యే
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుపై ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా ప‌రిధిలో కాజీపేటలో నిర్వహించిన బాలవికాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ లాంటి స‌మ‌ర్థ నాయకత్వం ఏపీలో ప‌రిపాలించ‌డం లేదని ప్ర‌జ‌లు భావిస్తున్న‌ట్లు చెప్పారు. పాలనలో ఏపీకి తెలంగాణకు పొంతన లేదన్నారు. ఏపీలో అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయని. పేదలను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో మీడియా మేనేజ్‌మెంట్ తప్ప సమస్యను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు.

ప్రజల సమస్యలను పట్టించుకోవ‌డంతో పాటుగా ప్ర‌జ‌ల‌కు కి తెలంగాణ ముఖ్య‌యంత్రి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలవడం శుభపరిణామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప్ర‌జా స‌మ‌స్య‌లను ప్ర‌స్తావించిన వారిపై అక్ర‌మ కేసులు మోపుతున్నారని, ఎమ్మెల్యేలు అని కూడా చూడ‌కుండా అరెస్టులు చేస్తున్నార‌ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప‌లు వ‌ర్గాలు త‌మ అభిప్రాయం చెప్పేందుకు పాద‌యాత్ర‌లు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతుంటే వారిని ముంద‌స్తుగా అరెస్టులు - గృహ‌నిర్భందాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప‌లువురు త‌మ అభిప్రాయాలు వినిపిస్తున్న‌ప్ప‌టికీ కేసీఆర్ ప్ర‌భుత్వం అణిచివేత‌కు పాల్ప‌డ‌టం లేద‌ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/