Begin typing your search above and press return to search.

గడపకు రావద్దు : వైసీపీ ఎమ్మెల్యేకు భారీ షాక్...?

By:  Tupaki Desk   |   21 May 2022 2:30 AM
గడపకు రావద్దు : వైసీపీ ఎమ్మెల్యేకు భారీ  షాక్...?
X
గడప గడపకు కార్యక్రమం కాదు కాదు నిరసన రేంజి ఏంటో సాక్షాత్తూ ప్రజా ప్రతినిధులు చవి చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టుకున్నారు. తన నియోజకవర్గం లోని జి సిగడాం మండలంలో విజయరామపురం గ్రామంలో ఆయన ఈ కార్యక్రమం చేయాల్సి ఉండగా మా గడపలకు రావద్దు మహా ప్రభో అంటూ ఒక వైపు ప్రజలు, మరో వైపు వైసీపీలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఎదురొచ్చి భారీ నిరసన తెలియచేయడంతో చేసేది లేక వచ్చిన దారినే ఎమ్మెల్యే తిరిగి వెళ్ళాల్సి వచ్చింది.

మూడేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉంటున్న గొర్లెకు సొంత పార్టీలోనే ఇబ్బందులు ఉన్నాయి. ఆయన మండలాలకు చెందిన నాయకులను కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఎచ్చెర్లలో అసమ్మతి వర్గం బలంగా పనిచేస్తోంది. వారు మీడియా ముందుకు వచ్చి మరీ గొర్లెకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని శపధం చేశారు.

ఇవన్నీ ఇలా ఉంటే జి సిగడాం పర్యటనలో మాత్రం ఎమ్మెల్యేల్కు పరాభావమే జరిగింది అంటున్నరు. ఆయనను అసలు గడపకే రావద్దు అని ప్రజలతో పాటు ఎమ్మెల్యే వ్యతిరేకులు అంతా కలసి గట్టిగా చెప్పేయడం విశేషం. మూడేళ్ళుగా మా మండలంలోని అనేక సమస్యలు ఉంటే ఏం చేస్తున్నారు అని జనాలు ఎమ్మెల్యేను ఈ సందర్భంగా నిలదీయడమూ గమనార్హం.

మరో వైపు చూస్తే మీకు ఓటేస్తే ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు అని జనాలే ముఖాన చెప్పేయడం కూడా బాధాకరమే అంటున్నారు. మొత్తానికి గడప గడపకూ వచ్చి సమస్యలు తెలుసుకోవాలని చూసిన ఎమ్మెల్యేకు తన రాకే వారికి అతి పెద్ద సమస్య అని అర్ధమయ్యేసరికి జనాగ్రహం కట్టలు తెంచుకుంది. మొత్తానికి గడప గడపకూ ప్రోగ్రాం లో ఇంతటి చేదు అనుభవం ఇప్పటిదాకా మరే ఎమ్మెల్యేలకు జరగలేదని వైసీపీలోనే చర్చించుకుంటున్నారు. మరి ఇవన్నీ చూసిన అధినాయకత్వం గొర్లెకు టికెట్ ఎటూ ఇవ్వదు, ఇచ్చినా ఆయన ఓడుతారు అని చెబుతున్నారు. మరో వైపు ఆయన్ని ఓడిస్తామని అటు ప్రజలు, ఇటు అసమ్మతి నేతలు చెబుతున్నారు. కాబట్టి ఎచ్చెర్ల ఫ్యాన్ పార్టీకు ముచ్చెమటలు పట్టేయడం ఖాయమే.