Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌తో ప్ర‌మేయం లేదా? అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన కీల‌క నేత‌!

By:  Tupaki Desk   |   20 Nov 2022 7:30 AM GMT
జ‌గ‌న్‌తో ప్ర‌మేయం లేదా?  అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన కీల‌క నేత‌!
X
వైసీపీ అంటే అంత‌ర్గ‌త క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరుగా గుర్తింపు ఉంది. ఎంతటి నాయ‌కుడైనా పార్టీ అధినేత జ‌గ‌న్ ఒక్క గీతీ గీస్తే దానిని అధిగ‌మించే సాహ‌సం చేయ‌ర‌నే పేరు కూడా ఉంది. గ‌తంలో జ‌గ‌న్‌ను విభేదించిన వారు కూడా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాతే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేశారు త‌ప్ప‌.. పార్టీలో ఉండ‌గా మాత్రం ఎవ‌రూ నోరు విప్పిన సంద‌ర్భాలు లేవు. ఎవ‌రైనా తోక ఝాఢిస్తున్నారని ఏమాత్రం సంకేతాలు వ‌చ్చినా తాడేప‌ల్లి ముందుకుగానే అలెర్ట్ అయి.. అలాంటివారిని అదుపు చేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

అయితే, ఇప్పుడు ఈ క్ర‌మశిక్ష‌ణ‌కు వ్య‌తిరేకంగా తొలిసారి, ఒక కీల‌క నాయ‌కుడు ఏకంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌డం పార్టీలో సంచ‌ల‌నంగా మారింది. గుంటూరులోని తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ టికెట్‌పై వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న ఎమ్మెల్యే మ‌హ‌మ్మ‌ద్ ముస్తాఫా తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రానున్న ఎన్నికల్లో తన కుమార్తెను బరిలో దింపుతున్నానని అన్నారు. త‌న రాజకీయ వారసురాలుగా త‌న కుమార్తెను నిలబెడుతున్న‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు.

వాస్త‌వానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో వార‌సులు బ‌రిలో ఉండేందుకురెడీ అవుతున్నారు. మ‌చిలీప‌ట్నం, శ్రీకాకుళంలోని న‌ర‌స‌న్న‌పేట‌, ఆముదాల‌వ‌ల‌స‌, విజ‌య‌న‌గ‌రం, గుంటూరులోని వినుకొండ‌, ప్ర‌కాశంజిల్లాలోని ఒంగోలు నియో జ‌క‌వ‌ర్గాల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. దీనికితోడు, మ‌రికొంద‌రు అంత‌ర్గ‌తంగా త‌మ వారిని రంగంలోకి దింపుతున్నారు. పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయిస్తున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిప్పుతున్నారు. అయితే, వార‌సుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చేది లేద‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పేర్ని నాని విష‌యంలోనే సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పిన‌ప్ప‌టికీ.. కొంద‌రు మాత్రం త‌మ దూకుడు ఎక్క‌డా త‌గ్గించ‌డం లేదు. ఇప్పుడు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కూడా ఈ కోవ‌లోకే వ‌స్తున్నారు. వాస్త‌వానికి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయిన ముస్త‌ఫా, వైఎస్ కుటుంబానికి ఎంతో విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గం విస్త‌ర‌ణ‌లో బెర్త్‌ ఆశించారు. అయితే, ఆయ‌న‌కు అవ‌కాశం చిక్క‌క పోవ‌డంతో మ‌న‌స్తాపంతో ఉన్నారు.

బ‌హుశ ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త‌న కుమార్తెను ప్ర‌క‌టించి ఉంటార‌ని పార్టీలో చ‌ర్చ సాగుతోంది. అయితే, అదిష్టానానికి మాట మాత్రం కూడా చెప్ప‌కుండానే, ఆయ‌న సొంత‌గా నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇప్పుడు ముస్తాఫాకు వార‌సురాలి విష‌యంలో ఓకే చేస్తే, మ‌రింత మంది కూడా తెర‌మీద‌కి వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌రి ఏం చేస్తారోచూడాలి.