Begin typing your search above and press return to search.

రజనీ మరిదిపై దాడి కేసు..ఆరుగురు అరెస్ట్!

By:  Tupaki Desk   |   25 Feb 2020 5:08 PM
రజనీ మరిదిపై దాడి కేసు..ఆరుగురు అరెస్ట్!
X
మహా శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ మరిది గోపిపై చోటుచేసుకున్న దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ ప్రభల యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో విడదల రజనీని టార్గెట్ చేసిన దుండగులు... ఆమె కారు అనుకుని ఆమె మరిది ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. కారులో ఉన్న గోపిని గాయపరిచారు. ఈ ఘటన తీవ్ర కలకలమే రేపింది. దాడి సమయంలో గోపి ఉన్నాడు కాబట్టి సరిపోయింది గానీ... రజనీ ఉండి ఉంటే... ఈ దాడి పెను కలకలమే రేపేదని చెప్పక తప్పదు.

విడదల రజనీ టార్గెట్ గా జరిగిన ఈ దాడిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనలో మొత్తం 24 మంది దుండగులు పాలుపంచుకున్నారని తేల్చారు. అయితే దాడి జరిగిన మరుక్షణమే అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకునేందుకు యత్నించిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యేను టార్గెట్ గా జరిగిన ఈ దాడిపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా కాస్తంత సీరియస్ గానే దృష్టి సారించారు. ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు... మంగళవారం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. మిగిలిన వారిని విచారిస్తున్నట్లుగా సమాచారం.