Begin typing your search above and press return to search.

విశాఖ గర్జనకు వచ్చింది ఎంతమంది?

By:  Tupaki Desk   |   16 Oct 2022 4:39 AM GMT
విశాఖ గర్జనకు వచ్చింది ఎంతమంది?
X
చేతినిండా అధికారం. తాము తలుచుకుంటే ఏమైనా చేస్తామన్న ధీమాతో పాటు.. తమ సత్తాను సీఎం జగన్ కు చూపించాలని తపించిన వైసీపీ నేతలకు దిమ్మ తిరిగే షాకిచ్చింది విశాఖపట్నం. ఎవరేం అనుకున్నా.. మరెన్ని చెప్పినా విశాఖనే పరిపాలనా రాజధానిగా చేస్తామన్న సందేశాన్ని ఇప్పటికే వినిపిస్తున్న వైసీపీ నేతలు.. తాము నమ్మిన విషయాన్ని మరింత బలంగా చాటేందుకు వీలుగా 'విశాఖ గర్జన ర్యాలీ'ని శనివారం ఉదయం నిర్వహించటం తెలిసిందే. కనీసం లక్షకు తగ్గకుండా నిర్వహించాలని భావించిన ఈ కార్యక్రమం పేలవంగా జరగటం షాకిచ్చింది.

ఎంతో భారీగా నిర్వహించాలని భావించి.. దానికి పెద్ద ఎత్తున కసరత్తు చేసినప్పటికీ ఫలితం మాత్రం గుండు సున్నా అన్న తరహాలో ఉండటం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ విషయంలో తమ వాదనకు ప్రజా స్పందన ఉందన్న విషయాన్ని తెలియజేయాలన్న పట్టుదలతో గర్జన కార్యక్రమాన్ని చేపట్టారు. 'రాజధానిగా అమరావతి వద్దు.. మూడు రాజధానులే ముద్దు' అన్న నినాదాన్ని బలంగా వినిపించటమే కాదు.. అమరావతికి అనుకూలంగా జరుగుతున్న పాదయాత్రకు కొత్త సవాలు విసరటం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించే ప్రజావాణి తేలిపోయేలా చేయటమే లక్ష్యంగా గర్జన చేపట్టాలని భావించారు.

బ్యాడ్ లక్ ఏమంటే.. వైసీపీ నేతలు ఎంతలా భావించినా.. గర్జనకు జనం రాలేదు. దీనికి తోడు వరుణుడు సైతం వైసీపీ పాలిట విలన్ గా మారిన పరిస్థితి. బస్సులు..వ్యాన్లను భారీగా ఏర్పాటు చేసి విశాఖకు జనాన్ని తరలించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా.. దెబ్బేసేలా మారింది. లక్షతో నిర్వహిద్దామనుకున్న గర్జన ర్యాలీ.. చివరకు పది వేల మందికే సంతృప్తి చెందాల్సిన పరిస్థితి. శనివారం ఉదయమే వర్షం పడటం.. పదిన్నరకు మొదలైన ర్యాలీ కాస్తంత ఊపందుకునే వేళలో మళ్లీ వర్షం పడటంతో వచ్చిన కాస్తమంది చెల్లాచెదురయ్యారు. దీంతో.. భారీగా చేపట్టాలనుకున్న గర్జన కాస్తా తుస్సుమంది. దీంతో..ర్యాలీ మొదలయ్యే సమయానికి కేవలం ఐదు వేల మంది వరకే మిగిలిన పరిస్థితి. దీంతో.. ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితిలో వైసీపీ నేతలు పడ్డారు.

ఈ గర్జన ర్యాలీ కోసం జగన్ ప్రభుత్వంలోని మంత్రులు భారీగా తరలిరావటం.. అందుకు భిన్నంగా జనాలు లేకపోవటంతో వారి నోటి వెంట మాట రాని పరిస్థితి. గర్జన సభతో అధినేత మనసును దోచుకోవాలనుకున్న ఆలోచనలకు భిన్నంగా భారీషాక్ తగిలిన పరిస్థితి. గర్జన ర్యాలీతో ఏదో చేద్దామనుకున్న స్థానే.. ఏమీ చేయలేక.. నోటి వెంట మాట రాలేని పరిస్థితి. ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నేతల ముఖం పాలిపోయిన దుస్థితి. మొత్తంగా ప్లాఫ్ షోను తలపించేలా గర్జన ర్యాలీ సాగినట్లుగా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ప్రచారం సాగింది. ఇది వైసీపీ నేతలకు మరిన్ని కష్టాల్ని తెచ్చి పెట్టనుందన్న మాట వినిపిస్తోంది.