Begin typing your search above and press return to search.

నేను ఎంత మంచివాడ్నో.. అంత మూర్ఖుడ్ని.. ఇవేం మాటలు కన్నబాబు

By:  Tupaki Desk   |   7 Feb 2021 1:47 AM GMT
నేను ఎంత మంచివాడ్నో.. అంత మూర్ఖుడ్ని.. ఇవేం మాటలు కన్నబాబు
X
అధికారం చేతిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించటం.. మాటలతో.. చేతలతో అందరికి ఆకట్టుకోవటం.. అందరి మనసుల్ని దోచుకోవటం లాంటివి పాత కాన్సెప్ట్ గా మారినట్లుంది. ఎంత కుదురితే అంత దూకుడుగా వ్యవహరించటం ఇప్పుడో అలవాటుగా మారింది. ప్రత్యర్థుల విషయంలో కనీస మర్యాదలు లాంటివి అస్సలు పట్టించుకోనట్లుగా ఉండటం.. ఎంత వీలైతే అంతలా మాటల తూటాల్ని పేల్చటం ఎక్కువైంది. ఏపీలో తాజాగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల మాటలు శ్రుతి మించి రాగాన పడుతోంది.

అందుకు నిదర్శనంగా విశాఖ జిల్లా ఎలమంచలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు కనిపిస్తారు. చూసినంతనే పెద్ద మనిషిలా కనిపించే ఆయన.. ఇటీవల కాలంలో నోరు విప్పితే చాలు.. ప్రత్యర్థుల మీద విరుచుకుపడటం ఎక్కువ అవుతోంది. తాజాగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో ఆయన ఆగ్రహావేశాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విజయం తమ ఖాతాలోనే పడాలన్న పట్టుదల ముదిరి పాకన పడటంతో.. హద్దు ఆపు లేకుండా వ్యాఖ్యలు చేసేస్తున్నారు.

ఎవరేం అనుకుంటారన్న మొహమాటాలు వదిలేసి చాలాకాలం కావటం.. ఇప్పుడంతా దూకుడు రాజకీయాలే దర్శనమిస్తున్నాయి. రాజకోడూరు పంచాయితీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన కన్నబాబురాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన టీడీపీ నేతలకు (ఆంజనేయరెడ్డి.. శంకరరావులు) నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని.. అందులో అనుమానం లేదని తేల్చేశారు. అందరికీ ప్రభుత్వ పట్టాలు అందాయని అనుకుంటున్నారేమో.. తేడా చేస్తే తర్వాత రావాల్సినవి ఏమీ అందవన్నారు.

సర్పంచ్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందేనని క్లియర్ గా చెబుతున్నానని తేల్చేశారు. ‘‘తేడా వస్తే మీ ఊరికి కొళాయిలు.. పైప్ లైన్లు ఏమీ ఉండవు. నిర్మాణంలో ఉన్న సచివాలయం పనులు నిలిచిపోతాయి. నేను ఎంత మంచివాడ్నో.. అంత మూర్ఖుడ్ని. ముఖ్యమంత్రి తర్వాత నియోజకవర్గంలో ఎవరికి ఏది ఇవ్వాలన్నా నేనే. పనుల కోసం.. పథకాల కోసం నా చుట్టూ ఊరు ఊరంతా కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం ఉండదు’’ అని స్పష్టంగా చెప్పేశారు.

అంతేకాదు.. గెలిచేది ఎవరైనా.. అధికారం తమదేనన్న ఆయన.. ఒకవేళ అవతల పార్టీకి చెందిన వ్యక్తి సర్పంచ్ గా గెలిస్తే.. కూర్చోవటానికి కుర్చీ కూడా ఉండదని.. నేల పైనే కూర్చోవాల్సి ఉంటుందన్నారు. దేవుడు చెప్పినా తాను వినని స్పష్టం చేశారు. టీడీపీకి చెందిన నేతలు ఎంత కలిసినా (స్థానిక నేతల్ని ఉద్దేశించి) తన వెంట్రుక కూడా పీకలేకపోయారన్నారు. ఈ విషయాల్ని గుర్తు పెట్టుకొని పంచాయితీ ఎన్నికల్లో ఓటు వేయకపోతే.. తర్వాత మీ ఇష్టం అంటూ తన వార్నింగ్ పరంపరను ముగించారు. కన్నబాబు రాజు మాటలు విన్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయాలు తమకు సుపరిచితమే అయినా.. ఈ తరహా రాజకీయాల్ని తొలిసారి చూస్తున్నట్లుగా పలువురు అభిప్రాయపడుతుండటం గమనార్హం.