Begin typing your search above and press return to search.

మాజీ ప్రధానిపై 100 ఏళ్ల వృద్ధుడి పోటీ

By:  Tupaki Desk   |   1 Nov 2022 11:30 PM GMT
మాజీ ప్రధానిపై 100 ఏళ్ల వృద్ధుడి పోటీ
X
హిందూ దేశం.. మన పైన ఉండే నేపాల్లో ఇన్ని సంవత్సరాలు గడిచినా తమకు న్యాయం జరగడం లేదని ఎంత మంది పోటీచేసినా ప్రజల సమస్యలు తీరడం లేదని ఓ 100 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్నికల్లో బరిలోకి దిగాడు. ఏకంగా మాజీ ప్రధాని ప్రచండపై బరిలోకి దిగుతుండడం రాజకీయంగా సంచలనమైంది. నవంబరు 20న జరగనున్న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ (ప్రచండ)పై పోటీ చేసి, హిమాలయ దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో శతాధిక స్వాతంత్ర్య సమరయోధుడైన టికా దత్తా పోఖరేల్ బరిలోకి దిగుతున్నారు. నేపాల్ లోనే 100 ఏళ్ల అత్యంత వయస్కుడైన అభ్యర్థిగా ఈయన పేరు గాంచాడు.

గూర్ఖా జిల్లాలో జన్మించిన పోఖారెల్, 67 ఏళ్ల ప్రచండకు వ్యతిరేకంగా 11 మంది అభ్యర్థులతో పాటు గూర్ఖా -2 నియోజకవర్గాల నుంచి అభ్యర్థిత్వాన్ని దాఖలు చేసినట్లు నేపాలీ కాంగ్రెస్ (BP) అధ్యక్షుడు సుశీల్ మాన్ సెర్చన్ తెలిపారు. 99 ఏళ్ల వయసులో ఎన్నికల సంఘం ఆయన పేరును అభ్యర్థిగా నమోదు చేసింది. పోఖరెల్ సోమవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, బాగా నడవగలరని, మాట్లాడగలరని, రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారని సెర్చన్ తెలిపారు.

ఏడుగురు పిల్లల తండ్రి అయిన పోఖరెల్ నేపాలీ కాంగ్రెస్ (బిపి) తరుపున ‘నీటి పాత్ర’ గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నవంబరు 20న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పెద్ద వయసున్న అభ్యర్థి ఆయనే. నేపాల్‌లో ఫెడరల్ పార్లమెంట్, ప్రావిన్షియల్ అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

దేశంలో అసలు నాయకుడే లేడని, తమను తాము నాయకులుగా చెప్పుకునే వారు కేవలం డబ్బు సంపాదించడానికే వచ్చారని పోఖారెల్‌ ఆరోపిస్తున్నాడు. ‘ప్రజలకు హక్కులు కల్పించేందుకు, మన దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చేందుకు నా అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశాను’ అని తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పోఖరెల్ అన్నారు. నేపాల్ దేశం ఇటీవల తన 239 ఏళ్ల హిందూ రాచరికాన్ని 2008లో రద్దు చేసింది.

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు తన ఇంటికి వచ్చిన ప్రజలతో పోఖారెల్ మాట్లాడుతూ.. ‘ప్రచండను ఓడించి ఎన్నికల్లో గెలుస్తానని’ పోఖారెల్ పేర్కొన్నాడు.‘‘గూర్ఖా రాయి, ఈ మట్టికి నేనెలాంటి వ్యక్తినో తెలుసునని, ప్రజలకు తెలుసు ఎవరిని గెలిపించాలో.. నా ప్రత్యర్థి ఎలాంటి వాడో తెలుసు.. ఈ దేశ నాయకులు విధానానికి, సూత్రాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయకుండా దేశాన్ని దోచుకున్నారు. అందుకే తనకు ఓటు వేసి మళ్లీ హిందూ దేశంగా మార్చేందుకు తోడ్పాటును అందించండి’ అని పోఖారెల్ వ్యాఖ్యానించారు.

"దశాబ్దాల తిరుగుబాటు సమయంలో నేపాలీ కాంగ్రెస్‌లోని చాలా మంది నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టు పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ తో ఎలా పొత్తు పెట్టుకుంటుంది" అని ఆయన అధికార నేపాలీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. గోర్ఖా జిల్లాలో ప్రచండ అభ్యర్థిత్వానికి నేపాలీ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ (బీపీ) పార్టీ తరుఫున ఆయన పోటీచేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.