Begin typing your search above and press return to search.

ఉప్పల్ మ్యాచ్ కు వెళ్లి వచ్చిన 22 ఏళ్ల కుర్రాడు గుండెపోటుతో హఠాన్మరణం

By:  Tupaki Desk   |   27 Sep 2022 4:19 AM GMT
ఉప్పల్ మ్యాచ్ కు వెళ్లి వచ్చిన 22 ఏళ్ల కుర్రాడు గుండెపోటుతో హఠాన్మరణం
X
హైదరాబాద్ కు చెందిన ఆ కుర్రాడి వయసు అక్షరాల 22 ఏళ్లు. అతడి పేరు కట్టా అభిజిత్ రెడ్డి. వరంగల్ నిట్ లో కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేశాడు. సౌదీకి చెందిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీ సౌదీ అరామ్ కోలో పెద్ద ఉద్యోగం సంపాదించిన అతడికి ఏడాదికి 70 వేల అమెరికన్ డాలర్లు జీతం. మన రూపాయిల్లో చెప్పాలంటే సుమారు రూ.58 లక్షలు. అంటే ఇంచుమించు నెలకు రూ.5 లక్షల వరకు. వచ్చే నెలలో జాబ్ లో చేరాల్సి ఉంది.

చదువు పూర్తి.. మంచి జాబ్ కొట్టి.. మరో నెలలో సౌదీకి వెళ్లాల్సిన ఆ కుర్రాడు ఆ హ్యాపీనెస్ లో ఉప్పల్ లో జరిగిన ఇండియా - ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు వెళ్లివచ్చాడు. ఎంజాయ్ చేసిన అతను ఇంటికి వచ్చి నిద్ర పోగా.. అర్థరాత్రి 2 గంటల వేళలో ఛాతీ నొప్పితో మెలుకవ వచ్చింది. అన్న ఇబ్బంది పడుతున్న విషయాన్ని తమ్ముడు గుర్తించి.. తల్లిదండ్రుల్ని నిద్ర లేపారు. అభిజిత్ గుండెపోటుతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి.. సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెససిటేషన్)మొదలు పెట్టారు.

ఆ వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజాము ప్రాంతంలో అతను మరణించిన విషయాన్ని వైద్యులు చెప్పారు. దీంతో.. ఆ తల్లిదండ్రులు ఒకసారిగా కుప్పకూలారు. అభిజిత్ తండ్రి సాదాసీదా వ్యక్తి కాదు. రాష్ట్ర వైద్య సేవలు.. మౌలిక సదుపాయాల డెవలప్ మెంట్ సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)ఎండీ. అంత పెద్ద స్థానంలో ఉండి.. పెద్ద పెద్ద ఆసుపత్రులు.. వందలాది మంది వైద్యులు బాగా తెలిసినప్పటికీ.. తన కొడుకును దక్కించుకోలేకపోవటం అందరిని వేదనకు గురి చేసింది.

ఇటీవల కాలంలో మధ్య వయస్కులకు గుండెపోటు రావటం తెలిసిందే. కొవిడ్ తర్వాత నుంచి ఇలాంటి కేసులు అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం కొవిడ్ వచ్చి తగ్గిన వారికి గుండె రక్తనాళాలు.. కాలి సిరల్లో రక్తం గడ్డ కట్టినా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. వాహనాల్లో తిరగటం.. ఎక్కువ సమయం టీవీ.. ఫోన్.. ల్యాప్ టాప్ లతో గడపటంతో పాటు.. శారీరక వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయటం కూడా గుండెకు చేటుగా మారుతుందని చెబుతున్నారు.

దీనికి తోడు గడిచిన కొంతకాలంగా పెరిగిన జంక్ ఫుడ్ వినియోగం కూడా ఆరోగ్య సమస్యలకు తావిస్తోంది. అకస్మాత్తుగా వచ్చే గుండెపోటును గుర్తించటం ఎలా? అన్న విషయంలోకి వెళితే..

- ఛాతీ మధ్య.. పై భాగంలో నొప్పి
- దవడ లాగినట్లుగా ఉండటం
- ఛాతీ నుంచి ఎడమ.. కుడి చేతుల వైపు నొప్పిగా ఉండటం
- గొంతు వైపు నొప్పి వ్యాపించటం
- చెమటలు పట్టటం
- శ్వాస కష్టం కావటం
- ఛాతీ బరువుగా ఉండటం

ఇవన్నీ కూడా గుండెపోటుకు లక్షణాలుగా చెప్పాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం ఒకటి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పైన చెప్పిన ఇబ్బందులు ఎదురైనంతనే వెనుకా ముందు ఆలోచించకుండా వైద్యుడ్ని సంప్రదించటం అస్సలు మరవద్దు. కొందరు.. గంటల కొద్దీ సమయాన్ని వేస్టు చేస్తుంటారు. మరికొందరు గ్యాస్ సమస్య కారణాన్ని గుండెపోటుగా భావించి ఆందోళన చెందుతారు. అందుకే.. గుండెపోటుకు సంబంధించిన అంశాల్ని చక్కగా అవగాహన చేసుకోవటం.. సమస్య వచ్చిందన్న భావన కలిగినంతనే వైద్యుడ్ని సంప్రదించటం ద్వారా.. ముప్పును చాలావరకు అధిగమించే వీలు ఉంటుంది. గుండె పోటు విషయంలో జర జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.